ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా పార్టీ వీడబోతున్నారంటూ గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ రాజకీయాలకు రోజా శాశ్వతంగా గుడ్ బై చెప్పి తమిళనాడు పాలిటిక్స్ లో చక్రం తిప్పేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు తాజాగా రోజా చెక్ పెట్టారు. పార్టీ వీడటంపై ఆమె క్లారిటీ ఇచ్చారు.
పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని అంకాలమ్మ గుడి వద్ద కొత్తగా నిర్మించిన బలిజ భవనాన్ని రోజా సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తాను వైసీపీకి రాజీనామా చేయబోతున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఆ ప్రచారం కేవలం ఊహాగానమేనన్నారు. పార్టీలు మారే వారిని ప్రజలు విశ్వసించరని.. ఎంత మంది గుడ్ బై చెప్పినా వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదని మాజీ మంత్రి అన్నారు. అలాగే జగన్ ఓటమి గురించి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో జగన్ ఓడిపోలేదని.. ప్రజలే ఓడిపోయారని రోజా చురకలు వేశారు.
ఎన్నికల్లో అంత ఘోరంగా ఓడిపోయే తప్పులు వైసీపీ నాయకత్వం, ఎమ్మెల్యేలు, పార్టీ చేయలేదనే విషయాన్ని తాను ఘంటాపథంగా చెబుతానని.. ఏం జరిగిందనేది ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు బయటపడుతుందని.. అప్పుడు ప్రజలు అన్నీ తెలుసుకుంటారని రోజా తమను తాము సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అలాగే అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నామని.. అధికారం లేకపోయినా ప్రజలకు అందుబాటులోనే ఉంటామన్నారు. ప్రస్తుతం రోజా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.