2019 ఎన్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నేత జగన్ రాష్ట్రమంతా 3600 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. తమ నేత చేసిన పాదయాత్ర వల్లే తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని వైసీపీ నేతలంతా అంటుంటారు. గతంలో వైఎస్సార్, ఆ తర్వాత చంద్రబాబు, ఆ కోవలోనే జగన్ చేసిన పాదయాత్రలు సక్సెస్ అయ్యి వారిని సీఎంని చేశాయి. ఇపుడు అదే కోవలో నారా లోకేష్ కూడా పాదయాత్ర చేయబోతున్నారు.
దీంతో, వైసీపీ నేతలకు ఇప్పటి నుంచే ఓటమి భయం పట్టుకుంది. దీంతో, తమను గెలిపించిన పాదయాత్ర సుద్ధ దండగ అన్న రీతిలో వారు విమర్శలు గుప్పిస్తున్న వైనం చూస్తే నవ్వు రాక మానదు. పాదయాత్రలు చేయడం వల్ల బరువు తగ్గడం తప్ప ఒరిగేదేమీ ఉండదని లోకేష్ ను ఉద్దేశించి పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా చేసిన కామెంట్లు కామెడీగా ఉన్నాయి. పవన్ వారాహితో వచ్చినా, లోకేష్ యువగళంతో వచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రోజా జోస్యం చెప్పారు.
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని వేగంగా అబివృద్ధి చేస్తున్నట్టు రోజా చెప్పారు. విజయవాడలోని భవానీ ఐలాండ్ లో తమ శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి కోసం జీవో కూడా తెచ్చినట్టు చెప్పారు. భవానీ ద్వీపంలో తొలిసారి ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలు నిర్వహించామని రోజా గుర్తు చేశారు. మరి, రోజా కామెంట్లపై టీడీపీ నేతల రియాక్షన్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.