టి20 క్రికెట్ ప్రపంచ కప్ నుంచి టీమిండియా అవమానకర రీతిలో వైదొలిగిన సంగతి తెలిసిందే. టోర్నీ మొత్తం అద్భుతంగా రాణించి సెమీస్ చేరిన భారత జట్టు…ఇంగ్లాండ్ జట్టు చేతిలో పసికూన మాదిరిగా ఘోర ఓటమి పాలైంది. 169 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఓపెనర్లను భారత్ బౌలర్లు ఏ దశలోను నిలువరించలేకపోయారు. ఇంగ్లాండ్ కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్ మన్ బట్లర్…మరో ఓపెనర్ హేల్స్ తో కలిసి భారత బౌలర్లను చీల్చి చెండాడారు.
భారత పేసర్లు, స్పిన్నర్లు ఏ దశలోనూ ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లపై ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. దీంతో, బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిన ఈ ఓపెనింగ్ జోడి 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 169 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. ఈ ఓటమి నేపథ్యంలో రోహిత్ సేనపై ట్రోలింగ్ జరుగుతోంది. కనీస పోరాట పటిమ లేకుండా ఇంత దారుణ ఓటమా అంటూ అభిమానులు మండిపడుతున్నారు. టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే అత్యంత సులువైన ఛేజింగ్ అంటూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ట్వీట్ చేయడం విశేషం.
ఇక, టీమిండియా ఓటమిని సెలబ్రేట్ చేసుకుంటోన్న దాయాది జట్టు పాకిస్థాన్ ప్రధాని కూడా ఈ ఓటమిపై వెటకారంగా స్పందించారు. ఈ ఆదివారం నాడు 170/0 వర్సెస్ 152/0 ల మధ్య మ్యాచ్ అంటూ సెటైరికల్ గా ట్వీట్ చేశారు. ఇక, టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై టీమిండియా ఆటగాళ్లపై సోషల్ మీడియాలో, మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒత్తిడిలో తమ బౌలర్లు విఫలమయ్యారని, బౌలింగ్లో సరిగా రాణించలేదని రోహిత్ శర్మ చెప్పాడు.
ఇక ఈ ఓటమి బాధ తర్వాత రోహిత్ శర్మ ఒంటరిగా కూర్చుని భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బౌలర్లు రాణించకపోవడంపై రోహిత్ తీవ్ర అసంతృప్తితో బాధపడుతూ కన్నీరు పెట్టుకున్న వైనం చర్చనీయాంశమైంది. రోహిత్ ను రాహుల్ ద్రవిడ్ ఓదార్చాడు.
https://youtu.be/0fvYY4uMvxE