కొద్దికాలం కిందట వచ్చిన ఓ సినిమాలోని సీన్ గుర్తుందా? తన చెరువు పోయిందంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అది చూసి అవాక్కవడం పోలీసుల వంతు, నవ్వుకోవడం మన వంతు అవుతుంది. అయితే, ఇప్పుడు నిజంగానే షాక్ అవడం మనవంతు. ఎందుకంటే… `రోడ్లు` దొంగతనం అవుతున్నాయి. ఇదేందయ్యా ఇది అని మీరు అప్పుడే ఆశ్చర్యపోకండి. అది జరుగుతోంది ఎక్కడో కాదు మన తెలుగు నేలపై!
ఔనండి. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈ రోడ్ల దొంగతనం జరుగుతోందట. రాజధాని ప్రాంతం కాబట్టి అక్కడ కొత్త రోడ్లు వేశారు. అయితే, తాజాగా అక్కడ ఆ కొత్త రోడ్లు ఉన్నట్టుండి మాయం అవుతున్నాయట! మీరు విన్నది నిజమే…ఆల్రెడీ వేసిన రోడ్లను దొంగతనం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. రాత్రి సమయంలో కొంతమంది రోడ్లను తవ్వుకొని ఎత్తుకుపోతున్నారని అంటున్నారు. వినడానికి వింతగా ఉన్నా…విడ్డూరమనుకున్నా…ఇదే నిజమని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కేవలం మాట మాత్రంగా చెప్పడమే కాకుండా స్థానికులు ఈ షాకింగ్ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారట! ఇప్పుడు ఆ పోలీసుల పరిస్థితి ఏంటో!
అయితే, ట్విస్టు ఇక్కడితోనే అయిపోలేదు. ఈ రోడ్ల దొంగతనమే వింత అనుకుంటే, ఇందులోకి రాజకీయాలు వచ్చి చేరాయి. అమరావతి రాజధానిగా ఉండటం ఇష్టం లేని అధికార పార్టీకి చెందిన వ్యక్తులే ఈ రోడ్ల దొంగతనం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తోంది. అయితే, అధికార పార్టీ కూడా తగ్గడం లేదు. ఇది తమ పని కానే కాదని క్లారిటీ ఇస్తోంది. ఇక ఈ వివాదం చిత్రంగా ఉండడం, ముదిరిపాకాన పడుతున్న నేపథ్యంలో తాము విచారణ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇక, ఆ రోడ్డు దొంగలు పోలీసులకు దొరుకుతారా? ఒకవేళ దొరికితే సదరు దొంగలు కొట్టేసిన రోడ్లను రికవరీ చేస్తారా? ఒకవేళ రికవరీ చేస్తే వాటిని ఏం చేస్తారు? అన్న సెటైర్లు సోషల్ మీడియాలో పేలుతున్నాయి.