వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా.. 2024 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఓడిపోయిన నాటి నుంచి రోజా దాదాపుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఏ మాత్రం చురుగ్గా పాల్గొనడం లేదు. ఫ్యామిలీతోనే పూర్తి సమయాన్ని గడుపుతున్నారు. వెకేషన్ కోసం ఇంగ్లాండ్ కూడా వెళ్లొచ్చారు.
అలాగే ఇటీవల తమిళనాడులో వరుసగా పలు దేవాలయాలను సందర్శిస్తూ.. అక్కడి మీడియాకు ఫోకస్ అవుతున్నారు. ఈ పరిణామాలన్నీ రోజా వైసీపీని వీడనున్నారనే ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. పైగా రోజా తాజాగా తన అధికారిక ఎక్స్ ఖాతాలో వైసీపీ పేరును ప్రస్తావించకపోవడం మరింత చర్చనీయాంశంగా మారింది. పార్టీ పేరును ఎక్కడా ప్రస్తావించకుండా కేవలం నగరి మాజీ ఎమ్మెల్యే, పర్యాటకం- యువజన సర్వీసుల మాజీ మంత్రిగా తన బయోడేటాలో పేర్కొన్నారు.
అలాగే తన అకౌంట్ హెడ్డర్లో జగన్ ఫొటోలను సైతం తొలగించారు. దీంతో వైసీపీకి రేపో మాపో రోజా గుడ్ బై చెప్పడం ఖాయమనే వార్తలు ఊపందుకున్నాయి. అంతేకాకుండా తమిళ రాజకీయాల్లో బిజీ కావడమే రోజా నెక్స్ట్ ప్లాన్ అని అంటున్నారు. రోజా భర్త సెవ్వమణి కోలీవుడ్ లో పేరున్న దర్శకుడు. రోజా కూడా తమిళ సినిమాల్లో నటించి అక్కడ స్టార్డమ్ సంపాదించుకుంది.
ఎలాగో 2029 ఎన్నికల్లో రోజాకు జగన్ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే వైసీపీని వీడి కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం(టీఎంకే) పార్టీలో చేరాలని రోజా భావిస్తున్నారట. తమిళనాడులో రాజకీయ అరంగేట్రం చేసేందుకు ప్రస్తుతం రోజా రంగం సిద్ధం చేసుకుంటున్నారట. త్వరలోనే అక్కడ తనకు తనకు అనుకూలమైన నియోజకవర్గాన్ని చూసుకుని.. అక్కడకు మకాం మార్చనున్నారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది.