మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకుని సైలెంట్ అయిపోయిన వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా.. మళ్లీ ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ లో బిజీ అయ్యారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నా.. వైసీపీ నాయకులు మాత్రం గడిచిన ఆరు నెలల్లో ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదంటూ గట్టిగా ప్రచారం చేసే పని పడ్డారు. తాజాగా రోజా కూడా అదే ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
ఆరునెలలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నది ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యలే తప్పా.. ప్రజలకు చేసిందేమి లేదని రోజా అన్నారు. వైసీపీ నేతల ఇళ్ల ముందు గుమ్మాలు కొట్టడం, పొలాలకు అడ్డంగా గోడలు కట్టడంమే పనిగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం ఇంతవరకు సూపర్ సిక్స్ పై దృష్టి పెట్టలేదని రోజా విమర్శించారు. తప్పుడు కేసులు బనాయించి తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని.. అయినా కూడా జగన్ సైనికులు దేనికీ భయపడరని రోజా అన్నారు.
భయం మా జగనన్న బ్లడ్ లోనే లేదని, ఆయన వెంట నడిచే సైనికులుగా తాము కూడా ఎవరికీ భయపడబోమని డైలాగ్స్ వేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో తాము ఎవరమూ ఎలాంటి తప్పుచేయలేదని రోజా సమర్థించుకున్నారు. కూటమి ప్రభుత్వానికి హనీమూన్ కాలం అయిపోయంది. నీతిమాలిన రాజకీయాలు చేస్తున్న కూటమిని అందరం ఒక్కటై ఎదుర్కుంటామంటూ రోజా హెచ్చరించారు. అధికారులు చట్టవిరుద్ధంగా పనిచేస్తే హెరాస్మెంట్ కేసులు పెట్టడం ఖాయయన్నారు. అయితే రోజా వ్యాఖ్యలను అధికార పక్షపార్టీ కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. మీరింకా పార్టీలోనే ఉన్నారా? అని కొందరు.. భయపడకపోతే ఎందుకు మీ ట్విట్టర్ అకౌంట్ ని మెసేజ్ ఆప్షన్ డిసేబుల్ చేశారు రోజా గారు? అని మరికొందరు సెటైర్స్ వేస్తున్నారు.