కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికలలో హైడ్రామా ఏర్పడిన సంగతి తెలిసిందే. పార్టీలోని సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శశి థరూర్ ల మధ్య ఈ పదవి కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. అయితే, సీనియర్ నేత అయి ఖర్గేకే సోనియా గాంధీతోపాటు పలువురి మద్దతు ఉందని, ఆయన గెలుపు లాంఛనమేనని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే, కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోరులో ఖర్గే ఘన విజయం సాధించారు.
9,385 ఓట్లలో ఖర్గేకు 7,897 ఓట్లు రాగా…థరూర్ కు 1,072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లలేదు. దీంతో, దాదాపు 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో గాంధీ కుటుంబం వెలుపలి వ్యక్తి ఎంపికవ్వడం విశేషం. ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీ నుంచి ఖర్గే అధ్యక్ష బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఆయన ప్రత్యర్థిగా బరిలో దిగిన శశి థరూర్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు నుంచి కాంగ్రెస్ లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
అయితే, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ లో రిగ్గింగ్ జరిగిందని తిరువనంతపురం ఎంపీ, ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి శశిథరూర్ సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తరప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగా చాలా అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఓట్ల లెక్కింపులో యూపీ ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దని ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మిస్త్రీని ఆయన కోరారు. ఈ విషయంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని అన్నారు.