సీఎం చంద్ర బాబు తిరుమలలో పర్యటనను పూర్తి చేసుకున్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే.. శనివారం ఉదయం మరోసారి శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు.. అదేసమయంలో కొత్తగా నిర్మించిన వకుళమాత వంటశాలను ప్రారంభించారు. పొయ్యి వెలిగించి.. కడిగిన బియ్యం ఎసట్లో పోసి.. గరిటెతో తిప్పారు. అనంతరం అధికారులతో భేటీ అయ్యారు. లడ్డూ ప్రసాదంపై సుదీర్ఘంగా చర్చించారు.
అయితే.. చంద్రబాబు తిరుగు ప్రయాణమైన కొన్ని నిముషాలకే తిరుమల కార్యనిర్వహణాధికారి జె. శ్యామ లరావు.. సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. గత వైసీపీ హయాంలో అమలు చేసిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని తిరుమలలో రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్ ఇకపై అమలు చేయబోమని.. కేవలం టెండర్ ప్రక్రియను మాత్రమే కొనసాగిస్తామని శ్యామలరావు స్పష్టం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే.. దీనికి కారణాలు మాత్రం వెల్లడించలేదు.
ఇదే రీజనా?
రివర్స్ టెండరింగ్ ద్వారా.. మరింత తక్కువ ధరలకు పనులు చేసే వారిని వైసీపీ హయాంలో ఆహ్వానించారు. అంటే.. ఒక అంశానికి సంబంధించి టెండర్లు పూర్తయిన పనులకు మరోసారి రివర్స్ టెండర్లు నిర్వహించేవారు. అంటే.. అప్పటికే కోట్ అయిన ధరల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇంకా తక్కువకు పాడుకున్నవారికి పనులను అప్పగించేవారు. అయితే.. దీనివల్ల నాణ్యత తగ్గుతున్నట్టు కూటమి సర్కారు గుర్తించింది. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ నుంచి అన్ని శాఖల్లోనూ రివర్స్ టెండర్ల విధానాన్ని రద్దు చేశారు. ఇప్పుడు దీనిని తిరుమలకు కూడా అన్వయించారు.
మరిన్ని ప్రసాదాలు..
తిరుమల శ్రీవారు అనగానే లడ్డూ ప్రసాదం మాత్రమే అందరికీ సుపరిచితం. ఎంతో భక్తి ప్రపత్తులతో శ్రీవారి ప్రసాదాన్ని తీసుకుంటారు. అయితే.. చాలా మందికి తెలియంది.. తెలిసినా.. అందుబాటులో లేని ప్రసాదాలు మరో మూడు ఉన్నాయి. ఇప్పుడు వాటిని కూడా ప్రజలకు విరివిగా అందుబాటులోకి తీసుకురావాలని తిరుమల నిర్ణయించింది. దీని ప్రకారం మైసూర్ పాక్, జిలేబీ, వడలను కూడా భారీ సంఖ్యలో ఉత్పత్తి చేసి.. సాధారణ భక్తులకు కూడా అందుబాటులోకి తీసుకువస్తారు. ప్రస్తుతం వీటిని వీవీఐపీలు, వీఐపీలకు మాత్రమే పరిమితం చేశారు.