సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. టైమ్లీగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేసే ఫైర్ బ్రాండ్ నేతల్లో విజయశాంతి ఒకరు. తాజాగా మరోసారి గులాబీ బాస్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ సర్కారు ఏ పని చేసినా అరకొరే చేస్తుందన్నారు. కరోనా కట్టడి చర్యల్ని చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. విద్యార్థుల్లో కరోనా వ్యాపిస్తున్నందున వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు విద్యా సంస్థల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారని.. కానీ.. మిగిలిన చోట్ల కట్టడికి ఏం చర్యలు తీసుకున్నారన్నది గమనిస్తే శూన్యమని తప్పు పట్టారు.
ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వ తప్పుల్ని ఉదాహరణలతో వెల్లడించారు. సూర్యపేటలో సోమవారం జరిగిన కబడ్డీ పోటీల సందర్భంగా చోటు చేసుకున్న ప్రమాదాన్ని ప్రస్తావించారు. నిర్వహణలో రెండు తప్పుల్ని అందరూ వేలెత్తి చూపిస్తున్నారన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న వేళ.. దాని నియంత్రణ చర్యలేవీ తీసుకోలేదని.. గ్యాలరీ సామర్థ్యాన్ని పరీక్షించటంలో నిర్వహకులు.. అధికారులు ఫెయిల్ అయ్యారన్నారు.
సూర్యపేట ఒక్క చోటే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా కూడా కోవిడ్ కట్టడికి తగిన చర్యలు అమలవుతున్న దాఖలాలు కనిపించటం లేదన్న ఆమె.. అధికారులకు సరైన మార్గదర్శకాలు ఇచ్చి పరిస్థితిని అదుపు తప్పకుండా చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందన్నారు. రాష్ట్రానికి పొరుగున ఉన్న మహారాష్ట్రలోని పరిస్థితుల్ని చూసైనా తెలంగాణ ప్రభుత్వం మేల్కోవాల్సి ఉందన్నారు.
పాలకుల పాపాన్ని ప్రజలు అనుభవించాల్సి వస్తుందేమోనన్న ఆందోళనను ఆమె వ్యక్తం చేశారు. సూర్యాపేట ఉదంతంలో రాష్ట్ర మంత్రి బాధ్యత నేరుగా ఉండటం.. ఈ ఉదంతంలో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నా ఎవరూ పెదవి విప్పక పోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో విజయశాంతి ఇదే అంశాన్ని సూటిగా ప్రశ్నించిన వైనం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందన్న అభిప్రాయం నెలకొంది.