టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండ్ ఫ్యామిలీపై కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ని యాగాలు చేసినా కేసీఆర్ చేసిన పాపాలు పోవని, తెలంగాణకు పట్టిన వాస్తుదోషం కేసీఆర్ అని, కేసీఆర్ ను ఇంటికి సాగనంపితేనే రాష్ట్రం బాగుపడుతుందని గతంలో బండి సంజయ్ షాకింగ్ కామెంట్లు చేశారు. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని, అయితే, కేసీఆర్ ను ఎప్పుడు జైలుకు పంపించాలన్న వ్యూహరచన చేస్తున్నామని గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి చిట్టా తమ దగ్గరుందని, 18 మంది ముఖ్యనేతలపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నామని కూడా బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ సహారా, ఈఎస్ఐ కేసుల వివరాలపై ఆరా తీస్తున్నామని, ఈ స్కాంలు చూశాకే సీఎం కేసీఆర్ ఎంత పెద్ద అవినీతిపరుడో తేలిపోయిందని కొద్ది నెలల క్రితం బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. అయితే, అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ కేసు ముందుకు కదిలింది లేదు…కేసీఆర్ జైలుకు వెళ్లిందీ లేదు. ఈ నేపథ్యంలోనే బీజేపీ పెద్దలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రేవంత్ షాకింగ్ కామెంట్లు చేశారు. కేంద్ర హోంమంత్రి స్థాయిలో అమిత్ షా మాట్లాడటం లేదని, కేసీఆర్ అవినీతికి కంచె వేసి కాపాడుతోంది అమిత్ షానే అని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అవినీతిపై కేంద్ర హోంశాఖ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ నిలదీశారు. కేసీఆర్ పై చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని, కానీ, మాటలతో కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు.
బీజేపీకి టీఆర్ఎస్ డబ్బులు పంపుతోందని, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా తెలంగాణ నుంచే డబ్బులు వెళ్తున్నాయని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అందుకే, సొంత పార్టీ నేతలపై కూడా సీబీఐ విచారణ జరిపిన బీజేపీ, కేసీఆర్ పై మాత్రం ఒక్క కేసు కూడా పెట్టడం లేదని ఆరోపించారు. కేసీఆర్ పై ఉన్న సీబీఐ కేసులను ఎందుకు తొక్కిపెడుతున్నారని రేవంత్ ప్రశ్నించారు. ఈఎస్ఐ కుంభకోణం కేసును ఎనిమిదేళ్లుగా నాన్చుతోంది బీజేపీనే అని మండిపడ్డారు. కేసీఆర్ ను బీజేపీ బొక్కలో వేయకపోవడానికి కారణం..బీజేపీకి కేసీఆర్ వేసే బొక్కలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.