మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిమాణాలు జరిగిన సంగతి తెలిసిందే. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మునుగోడు లోని చండూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఆ బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలోనే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై పార్టీ నేత అద్దంకి దయాకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం పెనుదుమారం రేపింది.
దీంతో అద్దంకి దయాకర్ తనపై చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అద్దంకి దయాకర్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. కానీ ఆ క్షమాపణలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతృప్తి చెందలేదు. తనను కావాలనే పార్టీ నేతలతో తిట్టించారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపిస్తున్నారు. అంతేకాదు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనకు సారీ చెప్పాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలోనే ఆ డిమాండ్ కు తలొగ్గిన రేవంత్ రెడ్డి తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బహిరంగ క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను విడుదల చేయడం సంచలన రేపింది. ‘ఈ మధ్య పత్రికా సమావేశంలో హోం గార్డ్ ప్రస్తావన, చండూరు బహిరంగ సభలో అద్దంకి దయాకర్.. వెంకట్ రెడ్డి గారిని ఉద్దేశించి పరుషమైన పదజాలం వాడటంతో ఆయన ఎంతో మనస్తాపానికి గురయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా క్షమాపణ చెప్పాలని ఆయన నన్ను డిమాండ్ చేశారు. కాబట్టి ఆయనకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా’ అన్నారు.
‘ఇలాంటి చర్యలు, ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీల పోషించిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారిని ఇలా అవమానించేలా ఎవరూ మాట్లాడటం సరికాదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారికి సూచన చేశా’ అని రేవంత్ సదరు వీడియోలో పేర్కొన్నారు.
కానీ,రేవంత్ క్షమాపణలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వీకరించలేదు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించిన తర్వాతే రేవంత్ రెడ్డి క్షమాపణపై ఆలోచిస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఉద్యమకారుడినైన తనను సొంత పార్టీ నేతలు అవమానించారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు, ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అద్దంకి దయాకర్ మరోసారి క్షమాపణలు చెప్పారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజా వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందన ఏవిధంగా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.