ప్రపంచ దేశాలను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరపెడుతోన్న సంగతి తెలిసిందే. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడంతో ఆయా రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. న్యూ ఈయర్ వేడుకుల సందర్భంగా జనాలు భారీ సంఖ్యలో గుమిగూడకుండా పలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కలవరపెడుతుండడంతో సీఎం కేజ్రీవాల్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఢిల్లీలో ఎల్లో అలెర్ట్ జారీ చేసిన కేజ్రీవాల్…సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి తెచ్చారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ఇక, నేటి నుంచి మీడియా, బ్యాంకులు, బీమా కంపెనీలు, టెలికాం సర్వీసులతో పాటు ముఖ్యమైన సేవలు మినహా ప్రైవేటు కార్యాలయాలన్నీ 50 శాతం సిబ్బందితో పనిచేయాలని, మాల్స్, దుకాణాలు సరి-బేసి విధానంలో ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరవాలని నిర్ణయించారు.
అదే విధంగా వివాహాలు, వేడుకలకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతిస్తారు.మాల్స్, రెస్టారెంట్లు, దుకాణాలు, సినిమా హాళ్లు, స్పాలు, రవాణా సర్వీసులు, జిమ్‌ల కార్యకలాపాలపై కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. గత 24 గంటల్లో ఢిల్లీలో మొత్తం 331 కేసులు నమోదు కాగా…వీటిలో 142 ఒమైక్రాన్ కేసులే. దీంతో, ఢిల్లీలో యాక్టివ్ కొవిడ్ కేసుల సంఖ్య 1,289కి పెరిగింది. 6 నెలల తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్యలో గణనీయంగా పెరుగుద ఉండడంతో కేజ్రీవాల్ ఆంక్షలు విధించారు.
రెసిడెన్సియల్ కాలనీల్లోని దుకాణాలకు మాత్రం సరి-బేసి విధానం నుంచి మినహాయింపు ఉంటుంది. పిక్నిక్లు లేదా గుమిగూడి ఉండటం వంటివి నిషేధం. స్పాలు, వెల్నెస్ క్లినిక్‌లకు అనుమతి లేదు. రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు, వేడుకలపై నిషేధం కొనసాగుతుంది. సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, జిమ్స్, విద్యా సంస్థలను కూడా మూసివేయనున్నారు. సగం మంది సిబ్బందితో రెస్టారెంట్లు, బార్లు రాత్రి 10 వరకూ తెరిచే ఉంటాయి. సగం కెపాసిటీతో ఢిల్లీ మెట్రో నడవనుంది. సెలూన్లు, బార్బర్ షాపులు, పార్లర్లు, పార్కులు తెరవడానికి అనుమతిస్తారు.