దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు నిరుద్యోగ సమస్య యువతను పట్టిపీడిస్తోంది. దీంతో, కరోనా కట్టడిలో ప్రధాని నరేంద్ర మోడీ విఫలమయ్యారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేకాదు, కరోనా వ్యాప్తికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన మోడీకి ట్విట్టర్లో ఈ రేంజ్ లో ట్రోలింగ్ జరగడం చర్చనీయాంశమైంది.
కొవిడ్‌ను కట్టడి చేయడంలో మోడీ విఫలమైన తీరును నిరసిస్తూ ట్విట్టర్‌ను నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. #ResignModi ట్రెండింగ్ లో ఉంది. ‘మోదీ రోజ్‌గార్ దో’, ‘మోదీ ఉద్యోగమివ్వు’ వంటి ట్వీట్లు హల్ చల్ చేస్తున్నాయి. మోడీకి తాజాగా జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదంటూ మండిపడుతున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కరోనా మృతదేహాలను రహస్యంగా కాల్చివేస్తున్నారన్న ఆరోపణలను ప్రస్తావిస్తూ దాదాపు 3 లక్షల ట్వీట్లు వచ్చాయంటే మోడీపై ఏ రేంజ్ లో వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది.
మరోవైపు, దేశంలో కరోనా పెరుగుదలకు మోడీనే కారణమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజ్‌ప్రతాప్ యాదవ్ సహా మరికొందరు నేతలు మోడీ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. అయితే, గత ఏడాది ఆగస్టు నుంచే మోడీపై సోషల్ మీడియా మండిపడింది. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో జేఈఈ, నీట్ గురించి మాట్లాకపోవడానికి నిరసనగా ఆ ప్రసంగ వీడియోకు 74వేల లైక్‌లు, 5 లక్షల డిస్లైక్ లు వచ్చాయి.