జనసేన అధినేత, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన బ్రో చిత్రంపై రాజకీయ వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పై, ఆయన మూడు పెళ్లిళ్లపై సినిమా, వెబ్ సిరీస్ చేయబోతున్నానంటూ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై పవన్ మాజీ భార్య, సినీ నటి రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ తనతో వ్యవహరించిన తీరు నూటికి నూరుపాల్లు తప్పేనని రేణు షాకింగ్ కామెంట్స్ చేశారు. అందులో ఎటువంటి సందేహం లేదని తేల్చి చెప్పారు.
అయితే, ఆ విషయంపై ఎటువంటి చర్చ చేయనవసరం లేదని, తమ విడాకుల వ్యవహారం వదిలేయాలని గతంలో కూడా ఒక ట్వీట్ చేశానని గుర్తు చేశారు. తనను, తన పిల్లలను రాజకీయాలలోకి లాగొద్దని అన్నారు. పవన్ డబ్బు మనిషి కాదని, ఆయనకు డబ్బంటే ఆసక్తి లేదని వెనకేసుకొచ్చారు. పవన్ లోని రాజకీయ నాయకుడు, సంఘసంస్కర్తకు తన సపోర్ట్ ఉంటుందని అన్నారు. పవన్ చాలా అరుదైన మనిషి అని, సమాజ హితం కోసం ఆయన చేసే కృషి విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. వ్యక్తిగతంగా జీవితంలో తాను నష్టపోయి ఉండొచ్చని, కానీ రాజకీయపరంగా పవన్ వంటి నేత ఉండాలని తాను కూడా కోరుకుంటానని అన్నారు.
అదే విధంగా ఇతరులు కూడా ఆయన వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి రాజకీయ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న విషయంపై దృష్టి పెట్టాలని కోరారు. కుటుంబం, వ్యక్తిగత జీవితం వదిలేసి సమాజం కోసం పాటుపడుతున్న పవన్ కు అందరూ మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు. అది వదిలేసి మూడు పెళ్లిళ్లు అంటూ ప్రతిసారి ఆయన వ్యక్తిగత జీవితాన్ని విమర్శించొద్దని, ఆయనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే రేణు దేశాయ్ కామెంట్లపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తమ క్యారెక్టర్లను సినిమాల్లో పెట్టి శునకానందం పొందవద్దని పవన్ కు హితవు చెప్పాలని రేణు దేశాయ్ కు అంబటి సూచించారు. తాజాగా పవన్ కు రేణు దేశాయ్ మద్దతు పలకడంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీలో ఉన్నారు.