ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు పనిచేసిన వ్యక్తికి సోదరుడు, ఆయన క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేసిన నేత హత్యకు గురైతే అది హై ప్రొఫైల్ కేసుగానే మారుతుంది. ఇక, ఆ ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్రానికి సీఎం అయితే తన చిన్నాన్నను చంపిన వారిని పట్టుకోవాలని సినిమాల్లో అయినా నిజ జీవితంలో అయినా విశ్వప్రయత్నం చేస్తుంటారు. ఇక, తన అన్నయ్య సీఎం అయ్యాడు కాబట్టి తన తండ్రిని చంపిన హంతకులను ఎక్కడున్నా వెతికి పెట్టుకొని శిక్ష పడేలా చేస్తాడని ఏ చెల్లెలైనా ఆశలు పెట్టుకోవడం అత్యంత సహజం.
కానీ, మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసులో అన్నయ్య జగన్ తీరు చూసి చెల్లెలు సునీతకు ఆ ఆశలు రెండేళ్ల క్రితం చచ్చిపోయాయి. అందుకే, రియల్ లైఫ్ లో కూడా రీల్ లైఫ్ తరహాలో తన తండ్రి హంతకులను శిక్షించాలని సునీత ఓ పెద్ద పోరాటమే చేస్తోంది. ఈ క్రమంలోనే, తన అన్నయ్య జగన్ సీఎంగా ఉన్న రాష్ట్రంలో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పొరుగు రాష్ట్రంలో ఈ కేసు విచారణ జరిపించాలని నిస్సహాయురాలైన సునీత ఏపీ హైకోర్టును అభ్యర్థించడం సంచలనం రేపింది.
ఈ క్రమంలోనే తాజాగా సునీత పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై సుప్రీంకోర్టు ఎన్నో ప్రశ్నలను సంధించింది. ఈ కేసు విచారణకు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసులో ఉన్న తీవ్ర ఆరోపణల ప్రకారం వ్యవహరిస్తున్నారా అని ప్రభుత్వాన్ని దేశపు అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. కోర్టులు సూచించిన ప్రకారమే సాక్షులకు భద్రత కల్పిస్తున్నామని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు ధర్మాసనానికి విన్నవించారు.
ఈ నేపథ్యంలోనే సునీత దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐ తరఫున న్యాయవాదులకు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తాము కూడా కౌంటర్ దాఖలు చేస్తామని రెండు రోజులు గడువు కావాలని ప్రభుత్వ తరఫు లాయర్ విజ్ఞప్తి చేశారు. ఇక, ఈ వ్యవహారంలో తనను ఇంప్లీడ్ చేయాలని వివేకా బంధువు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.
వివేకా కుమార్తె సునీత మినహా మరెవరి వాదనలు ఈ వ్యవహారంలో వినాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసు విచారణను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రంలో విచారణ జరపాలన్న పిటిషన్ విచారణను ఈ నెల 19కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఏదేమైనా తాజాగా, ఈ పిటిషన్ విచారణకు స్వీకరించడంతో జగన్ కు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైనట్లయింది.