ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిన సామెతలాగ తయారైంది కార్పొరేట్ సంస్ధల పరిస్ధితి. నూతన వ్యవసాయ చట్టాలను రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. కేంద్రప్రభుత్వం రూపొందించిన తాజా చట్టాలు బడా కార్పొరేట్ సంస్ధలైన అంబానీ, అదానీలకు మేలుచేయటానికి అని రైతులు మండిపోతున్నారు. అందుకనే పై రెండు కార్పొరేట్ సంస్ధల ఉత్పత్తులను కొనకూడదని ఆందోళన చేస్తున్న రైతుసంఘాలన్నీ ఏకగ్రీవంగా తీర్మానించాయి.
ముఖేష్ అంబానీ, అదానీ కంపెనీల్లో తయారయ్యే ఉత్పత్తుల్లో దేన్నీ కొనకూడదని చివరకు రిలయన్స్ సంస్ధ నడుపుతున్న జియో మొబైల్, జియో సిమ్ లను కూడా ఉపయోగించకూడదంటూ తీర్మానం చేయటం సంచలనంగా మారింది. ఆందోళనను తీవ్రతరం చేయటంలో భాగంగా రైతు సంఘాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఇటు కేంద్ర్రప్రభుత్వంతో పాటు అటు బడా కార్పొరేట్ సంస్ధలకు మింగుడుపడనివే అనటంలో సందేహం లేదు. అంబానీ, అదానీలపై రైతు సంఘాల ఆగ్రహానికి కారణం ఏమిటంటే వ్యవసాయ ఉత్పత్తుల నిర్వహణతో పై రెండు గ్రూపులకు సంబంధాలుండటమే అని తెలుస్తోంది.
పై రెండు గ్రూపుల ప్రయోజనాల రక్షణకే నరేంద్రమోడి పనిచేస్తున్నారంటు రైతులు తీవ్రస్ధాయిలో మండిపడుతున్నాయి. మోడి, అంబానీ, అదానీలది గుజరాత్ రాష్ట్రమే కాబట్టి వాళ్ళు చెబుతున్నట్ల మోడి ఆడుతున్నారంటూ సంఘాలు మండిపోతున్నాయి. రైతు సంఘాల తాజా తీర్మానం, నిర్ణయం ప్రకారం గనుక నడుచుకునేట్లయితే రిలయన్స్ తో పాటు అదానీ గ్రూపుకు వందల కోట్లరూపాయల నష్టాలు రావటం ఖాయమని సమాచారం. మొదటగా జియో మొబైల్, సిమ్ ను కూడా వాడకుండా దూరంగా పెట్టేస్తే రిలయన్స్ కు ఏమేరకు నష్టాలు వస్తాయో ఊహించలేకున్నారు.
అలాగే అదానీ గ్రూపుకు కూడా భారీ ఎత్తున నష్టాలు తప్పేలా లేదు. అదాని చైన్ ఆఫ్ కంపెనీల్లో వ్యవసాయ రంగమే కాకుండా అనేక రీటైల్ వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇపుడు అంబానీ, అదానీ గ్రూపుకు చెందిన ఏ ఉత్పత్తిని, వస్తువును వాడకూడదంటే వాటికి జరిగే నష్టాలు మామూలుగా ఉండవు. పంజాబ్, హర్యానా, మహారాష్ట్రలోని రైతు కుటుంబాలే కోట్లలో ఉంటాయి. ఇపుడు వీళ్ళంతా హఠాత్తుగా పై రెండు గ్రూపుల ఉత్పత్తులను దూరంగా పెట్టేస్తే వాటికి ఇబ్బందనే చెప్పాలి. అందుకనే రైతుల తాజా నిర్ణయం కార్పొరేట్ ప్రపంచంలో సంచలనంగా మారింది. మరిపుడు కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.