ఇటీవల వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ హస్తినలో కమలం వికసించింది. అయితే, ఫలితాలు వెలువడి 12 రోజులు కావస్తున్నా ఢిల్లీకి కాబోయే సీఎం ఎవరు అన్నదానిపై సస్పెన్స్ వీడలేదు. ఈ క్రమంలోనే ఆ ఉత్కంఠకు బీజేపీ అధిష్టానం తాజాగా తెరదించింది. షాలీమార్ బాగ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాను ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి అని బీజేపీ ప్రకటించింది.
ఈ ప్రకారం ఆమెను బీజేపీఎల్పీ లీడర్ గా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేపు రామ్లీలా మైదానంలో రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు.
ఢిల్లీ సీఎం ఎంపిక కోసం పరిశీలకులను బీజేపీ నియమించింది. బీజేపీ ఎమ్మెల్యేల భేటీలో అధిష్టానం రేఖా గుప్తా పేరును నిర్ణయించిన విషయాన్ని వెల్లడించారు. దీంతో, హై కమాండ్ నిర్ణయానికి ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా కట్టుబడి ఉంటామని చెప్పారు.ఈ క్రమంలోనే పోటీ లేకుండా రేఖా గుప్తా సీఎం పదవి చేపట్టబోతున్నారు. రేఖా గుప్తాతో పాటు ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్, పవన్ శర్మ, ఆశిష్ సూద్, శిఖా రాయ్, పర్వేష్ సాహిబ్ సింగ్, రవీంద్ర ఇంద్రరాజ్ సింగ్, కైలాష్ గంగ్వాల్, అనిల్ గోయల్, రాజ్ కుమార్ భాటియా పేర్లు కూడా సీఎం రేసులో వినిపించాయి.
అయితే, మహిళా ఎమ్మెల్యే ఢిల్లీ సీఎం అయితే బాగుంటుందని బీజేపీ పెద్దలు భావించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ఘడ్ సీఎంల ఎంపికలో కూడా అనూహ్యంగా కొత్తపేర్లను బీజేపీ పెద్దలు ప్రకటించారు. ఆయా రాష్ట్రాలలో సామాజిక సమీకరణలు, తాజా రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రులను బీజేపీ హై కమాండ్ ఎంపిక చేస్తోంది.