సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు, వైసీపీ సర్కార్ కు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. సాధారణంగా కోర్టు తీర్పులకు అనుగుణంగా జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, జగన్ సర్కార్ రూటే సపరేటు….ఏబీ వ్యవహారంపై కోర్టు విచారణ కొనసాగుతుండగానే….ఆయనను డిస్మిస్ చేయాలని నిర్ణయించడం ఇపుడు చర్చనీయాంశమైంది.
ఏబీని డిస్మిస్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రతిపాదనలు పంపడం కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి రహస్యంగా దానికి సంబంధించిన జీవో జారీ అయింది. ఏబీపై మేజర్ పెనాల్టీ (డిస్మిస్) అమలు చేయాలని కేంద్ర హోం శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఏబీపై అభియోగాలు, విచారణలోని అంశాలతో కూడిన అభియోగ పత్రాన్ని కేంద్రానికి పంపారు. ఏబీ సర్వీసులో కొనసాగేందుకు అనర్హుడని, ఆయన్ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది.
జగన్ సీఎం అయిన వెంటనే ఏబీ వెంకటేశ్వరరావుపై విచారణ చేపట్టి ఆఘమేఘాల మీద సస్పెన్షన్ వేటు కూడా వేశారు. నిఘా పరికరాల కొనుగోలు ఆరోపణలు, కొందరు అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ అభియోగాలు మోపి సస్పెండ్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత తన సస్పెన్షన్ పై ఏబీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ పిటిషన్ విచారణ కొనసాగుతోంది.
డిపార్ట్ మెంటల్ ఎంక్వయిరీలో భాగంగా ఏబీ వెంకటేశ్వరరావు కొద్దిరోజుల క్రితం కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కు వాంగ్మూలం ఇచ్చారు. ఏబీపై ఉన్న కేసులుక సంబంధించి ప్రజెంటింగ్ ఆఫీసర్‌ను నియమించి విచారణ జరుపుతున్నారు. అయితే, ఈ లోపే ఏబీని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలనుకోవడం కక్ష సాధింపు చర్యేేనని విమర్శలు వస్తున్నాయి. అయితే, అఖిల భారత సర్వీసు అధికారుల డిస్మిస్ వ్యవహారాలన్నీ కేంద్రమే చూస్తుంది. కాబట్టి ఏబీ సస్పెన్షన్ పై తుది నిర్ణయం కేంద్రానిదే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేవలం సిఫారసు మాత్రమే చేయగలదని తెలుస్తోంది. మరి, ఈ వ్యవహారంపై కేంద్రం నిర్ణయం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.