వైసిపి నేతలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవన్ పై వైసీపీ నేతలు కూడా అదే స్థాయిలో విమర్శలు గుప్పించడం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని ఉందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ సంచలన ఆరోపణలు చేశారు. పవన్ ను కొందరు అనుమానాస్పద వ్యక్తులు అనుసరిస్తున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మనోహర్ ఆరోపించడం సంచలనం రేపుతోంది.
ముఖ్యంగా విశాఖ పరిణామాల తర్వాత పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన నివాసం, కార్యాలయం వద్ద కొత్త వ్యక్తులు తచ్చాడుతున్నారని నాదెండ్ల ఆరోపించారు పవన్ ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు పవన్ వాహనాన్ని గుర్తు తెలియని వాహనాలు వెంబడిస్తున్నాయని ఆరోపించారు. వారు పవన్ కారును నిశితంగా పరిశీలిస్తున్నారని, వారు అభిమానులు కాదని పవన్ వ్యక్తిగత సిబ్బంది కూడా చెబుతున్నారని నాదెండ్ల వెల్లడించారు.
ఇక, సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు పవన్ నివాసం వద్ద గొడవ చేశారని తెలిపారు. పవన్ ఇంటి ఎదురుగా కారు పార్క్ చేయడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారని, దీంతో, వారు పవన్ ను బూతులు తిట్టడం మొదలు పెట్టారని అన్నారు. పవన్ సిబ్బందిని రెచ్చగొట్టేందుకు వారు ప్రయత్నించినా…సిబ్బంది సంయమనం పాటించి వారు ఆ ఘటన వీడియో తీశారని వివరించారు. ఈ వ్యవహారంపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని చెప్పారు.