ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద తలనొప్పి వచ్చి పడింది. సాధారణంగా ఎన్నికలకు ముందు ఉండే.. రెబల్స్ బెడద ఇప్పుడే.. వైసీపీని చుట్టుముట్టింది. పదుల సంఖ్యలో ఎక్కడికక్కడ నాయకుల మధ్య ఘర్షణలు పెరిగిపోతున్నాయి. నువ్వా.. నేనా.. అనే రేంజ్లో వైసీపీ రాజకీయాలు మారిపోతున్నాయి. దీంతో నేతల మధ్య సఖ్యత లేకపోగా.. పార్టీ మరింత బలహీనం అయ్యేలా వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
నిన్న మొన్నటి వరకు ఉమ్మడి గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో జరిగిన రగడ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. నియోజకవర్గం సమన్వయ కర్తగా మాజీ మంత్రి.. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాదరావును నియమించారు. దీంతో శ్రీదేవి అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
ఈ పరిణామం ఇంకా చల్లారనేలేదు. ఇంతలోనే ఇదే జిల్లాలోని బాపట్ల పార్లమెంటు స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిగం సురేష్ వర్గం కూడా పార్టీ అధిష్టానంపై కారాలు మిరియాలు నూరు తోంది. వచ్చే ఎన్నికల్లో సురేష్‌ను అసెంబ్లీకి పంపించాలని.. పార్టీనిర్ణయించుకుందని.. వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇదేంటని.. వారు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరంలో టీడీపీ ఎమ్మెల్యే వంశీని పార్టీలోకి తీసుకున్నారు. ఆయనకు వైసీపీ నాయకులకు ఇక్కడ ఏమాత్రం పొత్తు కుదరడం లేదు. వచ్చే ఎన్నికల్లో టికెట్‌పై యార్లగడ్ల వెంకట్రావు పట్టు వీడడం లేదు. దీంతో వంశీ వర్సెస్ వైసీపీ నాయకుల మధ్య వివాదాలు తారస్తాయికి చేరారు. వంశీకి టికెట్ ఇస్తే.. ఓడించి తీరుతా మని.. యార్లగడ్డ వర్గం బాహాటంగానే ప్రకటిస్తోంది.
ఇక, ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ డామినేషన్ గా ఉన్న కమ్మ సామాజికవర్గం నాయకులు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిని మార్చాలని పట్టుబడుతున్నారు. ఇక్కడ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ, గత ఎన్నికల్లో ఆయన తమను వాడుకుని వదిలేశారని.. ఇక్కడి నాయకులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
ఇక, ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో మంత్రి సురేష్‌కు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. కొండపిలో పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకులు.. రెండుగా చీలిపోయి.. తమ వర్గానికే ప్రాధాన్యం ఇవ్వాలని.. రోడ్డెక్కారు. ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా చాపకింద నీరులా.. కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.
నెల్లూరులో మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ అనిల్‌కుమార్ సైలెంట్ కావడం.. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తనకు మంత్రి పదవి రాలేదన్న అలకను ఇప్పటికీ వీడకపోవడం.. ఇదే జిల్లాలోని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కూడా ఇదే అసంతృప్తితో ఉండి.. పార్టీకి దూరంగా ఉంటున్నారు.
ఇక, సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సొంత పార్టీ నాయకులే గ్రూపులు కట్టారు. వీటిలో కడప, రాజంపేట, రైల్వే కోడూరు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. కర్నూలులోని పత్తికొండ మరింత వివాదంగా మారింది. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన కంగాటి శ్రీదేవికి, మంత్రి బుగ్గను పొసగడం లేదు. దీంతో ఆమెకు చెక్ పెట్టేలా మంత్రి తన అనుచరులను ప్రోత్సహిస్తున్నారని.. పార్టీలో నేతలు చర్చించుకుంటున్నారు.
మరోవైపు.. అనంతపురంలోని కీలకమైన రాప్తాడులో ఎమ్మెల్యే అవినీతిపై సొంత పార్టీ నాయకులు కరపత్రాలు పంచడం.. ఇటీవల తీవ్ర వివాదానికి దారితీసింది.
ఇవన్నీ ఒక ఎత్తయితే.. గత ఎన్నికల్లో తమ వద్ద ఎన్నికల ఖర్చుల కోసమని.. అప్పులు తీసుకున్న నాయకులు.. వాటిని తిరిగి చెల్లించడం లేదంటూ.. మంత్రి రోజా నియోజకవర్గం నగరిలో నాయకులు ఏకంగా అధిష్టానం దగ్గరే పంచాయతీ పెట్టారు.
ఇటు ఉమ్మడి తూర్పుగోదావరిలోని అమలాపురం ఎమ్మెల్యే కం మంత్రి పినిపే విశ్వరూప్పైనా ఇవే ఆరోపణలు ఉన్నాయి. శ్రీకాకుళంలో నేతల మధ్య ఆధిపత్య హోరు.. వివాదాలకు దారితీస్తోంది. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా.. పదుల సంఖ్యలో వైసీపీలో వివాదాలు.. ఘర్షణలు కనిపిస్తుండడం గమనార్హం. మరి వీటిని అధిష్టానం ఎలా సరిచేస్తుందో చూడాలి.
Comments 1