రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కంచుకోటలుగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో గ్రేటర్ నగరాలు ఏర్పాటు చేయాలని వైసీపీ భావిస్తోంది. అయితే, ఉన్నట్టుండి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రాజకీయంగా టీడీపీని మరింత ఇరకాటంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను పెంచుతామన్న వైసీపీ 26(రెండు గిరిజన జిల్లాలు) కాకుండా వీటి సంఖ్యను 32కు పెంచుతున్నట్టు వైసీపీ వర్గాలు మీడియాకు లీక్ చేశాయి. అదేసమయంలో కొన్ని నగరాలను(నియోజకవ ర్గాలను) గ్రేటర్ ప్రాధాన్యంలో ఉంచుతున్నట్టు కూడా చెబుతున్నారు.
వీటిలో కీలకమైన అనంతపురం జిల్లా హిందూపురం, విజయనగరంలోని విజయనగరం, అమరావతిలో అమరావతి, కృష్ణాలో విజయవాడ, మచిలీపట్నం, కర్నూలు జిల్లాలోని ఆదోని, గుంటూరులో నరసరావుపేట, ఏలూరులో ఏలూరు నియోజకవర్గాలను గ్రేటర్ నగరాలుగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే, వీటి వెనుక టీడీపీ ఓటు బ్యాంకును వైసీపీకి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇటీవలే తిరుపతిని గ్రేటర్‌గా ప్రతిపాదించారు. దీనికి తగిన హంగులు అద్దుతున్నారు. ఈ క్రమంలోనే మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఇదే తరహాలో గ్రేటర్ నగరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
గ్రేటర్ నగరాలుగా ఏర్పాటు చేయాలనుకుంటున్న నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకును పరిశీలిస్తే.. టీడీపీకి అనుకూల పరిణామా లు ఎక్కువగా ఉన్నాయి. వరుస విజయాలు కైవసం చేసుకుని టీడీపీ దూసుకుపోయింది. అయితే, కేవలం గత ఎన్నికల్లోనే టీడీపీ పరాజయం పాలైనా.. ఓటు బ్యాంకు మాత్రం స్థిరంగానే ఉంది. ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు గెలుపు గుర్రాలు ఎక్కినా.. తక్కువ మెజారిటీతోనే విజయం సాధించారు. ఈ క్రమంలోనే వైసీపీ పాగా వేసేందుకు అనూహ్యంగా గ్రేటర్ అంశాన్ని వినియోగించుకునేలా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
గ్రేటర్ నగరాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రియల్ బూమ్ పెరగడంతోపాటు మౌలిక సదుపాయాలు, రహదారుల విస్తరణ చేసేందుకు మరింత అవకాశం ఉంటుంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపుతారనే వ్యూహంతోనే వైసీపీ గ్రేటర్ ఆలోచన దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మరి దీనిని చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారు? నిజంగానే ఓటు బ్యాంకు తరలిపోతుందా? అనేది చూడాలి.