టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ .. సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటల తూటాలు పేల్చారు. 49 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన రాయలసీమకి జగన్ ఇచ్చింది ఏమిటి అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వస్తే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమను అభివృద్ధి చేసి చూపిస్తాం అని అన్నారు. యువగళం పాదయాత్ర 123వ రోజు కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో కొనసాగింది. టీడీపీ శ్రేణులు అడుగడుగునా లోకేష్‌కు స్వాగతం పలికాయి.
కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం రైతులతో నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. జగన్ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని రైతులు ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. రాయలసీమ రైతులకు నీరు ఇస్తే బంగారం పండిస్తారనీ… టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని తీసుకొస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. జగన్ పాలనలో రైతులు నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగుల మందులతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని లోకేష్ చెప్పారు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం టీడీపీ ప్రభుత్వం.. 11,700 కోట్లు ఖర్చు చేస్తే… జగన్ ప్రభుత్వం అందులో 10 శాతం కూడా ఖర్చు చెయ్యలేదని అన్నారు. 49 మంది ఎమ్మెల్యేలను రాయలసీమ లో గెలిపిస్తే జగన్ రాయలసీమకి ఇచ్చింది ఏమిటి అని ప్రశ్నించిన లోకేష్.. వైసీపీకి 2019 లో ఇచ్చిన సీట్లు మాకు ఇవ్వండి రాయలసీమ ని అభివృద్ధి చేసి చూపిస్తాం అని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే భవిష్యత్తు కు గ్యారెంటీ పేరుతో అన్నదాత కు 20 వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తాం అని అన్నారు. చంద్రబాబు ఒకే సంతకంతో రూ. 50 వేల లోపు ఉన్న పంట రుణాలు అన్నీ మాఫీ చేశారని లోకేష్ గుర్తు చేశారు.
సోమశిల ప్రాజెక్టు ముంపు బాధితులకు అన్యాయం జరిగిందని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని నారా లోకేష్ చెప్పారు. మొదటి 18 నెలల్లో పరిహారం అందిస్తామని తెలిపారు. బద్వేల్ నియోజకవర్గం లో పెండిగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే అదనంగా మరో 80 వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఇసుక దోపిడీ లో జే ట్యాక్స్ రోజుకి రూ.3 కోట్లు అని ఆరోపిచారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కుందూ ప్రాజెక్ట్ పూర్తి చేసి సాగునీరు అందిస్తాం అని హామీ ఇచ్చారు.