తెలుగు మీడియా రంగంలో ఓ శకం ముగిసింది…ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవిదేశాలలోని తెలుగువారికి మీడియా మొఘల్ గా సుపరిచితులైన చెరుకూరి రామోజీ రావు అస్తమించారు. తెలుగు మీడియా రంగంలో, తెలుగు రాజకీయాలలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న రామోజీరావు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. జూన్ 5వ తేదీన అస్వస్థతకు గురైన రామోజీరావు చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామోజీరావును కాపాడేందుకు డాక్టర్లు చేసిన విశ్వ ప్రయత్నాలు ఫలించలేదు. గుండెకు స్టెంట్ వేసిన తర్వాత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు పెద్దగా బయటకు రావడం లేదు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం తరలించారు. రామోజీరావు మృతి పట్లు పలువురు రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అక్షర శిల్పి రామోజీ రావుకు అశ్రు నివాళి
చెరుకూరి రామోజీరావు, ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం అతనిని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించింది.
కుటుంబ నేపథ్యం…
రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించాడు. దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు. ఇతనికన్నా ముందు ఇద్దరు అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ.
బాల్యం, విద్యాభ్యాసం, వివాహం (1937 – 1961)
ఇతని కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం. తల్లి చాలా భక్తిపరురాలు, ఆచారవంతురాలు కావడంతో చిన్నతనంలో ఇతనికీ భక్తి, శుచి అలవడింది. లేకలేక పుట్టిన మగసంతానం కావడంతో రామోజీని చాలా ముద్దుచేసేవారు. పెద్దక్క పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయినా చిన్నక్క రంగనాయకమ్మతో సాన్నిహిత్యం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటిపనుల్లో, వంటలో సహాయం చేసే అలవాటూ ఉండేవి. రామయ్య అన్న తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేప్పుడే స్వంతంగా “రామోజీ రావు” అన్న పేరును సృష్టించుకుని, తానే పెట్టుకున్నాడు. ఆ పేరే జీవితాంతమూ కొనసాగుతోంది.
రామోజీరావు 1947లో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరాడు. 1957లో ఆరవ ఫారం అక్కడే పూర్తిచేసుకుని, గుడివాడ కళాశాలలో ఇంటర్, బీఎస్సీ చదివారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు, పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ కాగా పెద్దలు పెట్టిన పేరు నచ్చక అలా మార్చుకుంది. రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బావమరిది తాతినేని వెంకట కృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో డైరెక్టరుగా, తోడల్లుడు ముసునూరు అప్పారావు ఈనాడు, డాల్ఫిన్స్ హోటల్స్ మాజీ ఎండీగా కలసి పనిచేశారు.