రామోజీ రావు.
ఒక మీడియో మొఘల్.
మేరు శిఖరం
జీవితంలో ఎవరైనా తన వద్దకు వెళ్లాల్సిందే గాని తాను ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేని స్థాయి తనకు తాను ఏర్పరుచుకున్నాడు.
ఇందిరాగాంధీ వంటి పవర్ ఫుల్ వ్యక్తులకు కూడా వ్యతిరేకంగా రాశారు.
అధికారంలో ఉండి… తనను ఏమైనా చేయగలిగిన కాంగ్రెస్ ను చీల్చిచెండాడాడు.
అలాంటి రామోజీ అస్త్రసన్యాసం చేసిన రోజుగా ఈరోజును చెప్పొచ్చు.
ఆయన చాలాకాలం క్రితమే అస్త్ర సన్యాసం చేశారు కానీ అది పబ్లిక్ అయ్యింది ఈరోజే.
ప్రధానులను, ముఖ్యమంత్రులను ఆడించిన రామోజీ తెలంగాణలో అధికారంలో ఒక ప్రాంతీయ పార్టీ యువ నాయకుడిని తన భేషజాలు పక్కనపెట్టి ’’నువ్వు తోపు‘‘ అని కీర్తించాడు.
తన జీవితంలో రామోజీ ఎవరినీ ఇలా పొగడలేదు.
మరెందుకు ఈ పరిస్థితి వచ్చింది. ఆయనకు ఆ అవసరం ఎందుకు వచ్చింది?
ఈరోజు కేటీఆర్ గురించి రామోజీ రాసిన లేఖలోని అంశాలు అనేక సందేహాలు, అనుమానాలకు తావిచ్చినా… అందులో చాలా క్లారిటీ ఉంది.
ఏకంగా ప్రధాని స్థాయి వ్యక్తి అని పోల్చడం అసాధారణ విషయం.
దీనిని అనేక కోణాల్లో విశ్లేషించుకోవచ్చు
1 . ఒకటి తన కంపెనీల భవిష్యత్తు !
తన కంపెనీల మూలాలన్నీ తెలంగాణలోనే ఉన్నాయి. ఆ తెలంగాణలో ఎప్పటికైనా తన కంపెనీలకు థ్రెట్ ఉందటే అది బీజేపీ వల్లనో, కాంగ్రెస్ వల్లనో కాదు, కేవలం తెరాస వల్లనే. మరి ఇంతకాలం లేదా అని మీరు అడగొచ్చు. ఇంతకాలం ఆయన ఒంట్లో సత్తువ ఉండేది… అంతకుమించి తెగింపు, దానికి మించి వ్యూహాం ఉండేది. కాబట్టి ఎలాంటి వారితో అయినా సై అంటే సై అనేవాడు. కానీ తాను ఇపుడు సడలిపోయాడు, వయసు మీదపడింది. తన సంతానంలో ఆ తెగింపు లేదు, బహుశా వారికి అలా పోరాటాలపై ఆసక్తి కూడా లేదు. ఈ విషయాన్ని పరోక్షంగా వదిలించి తెలంగాణలో మరో 20 ఏళ్లలో ఇపుడు లేదో ఇంకెపుడో ఒక టెర్ము ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న వ్యక్తి కాబట్టి… మా వాళ్లను మా సంస్థల జోలికి రాకుండా కేటీఆర్ ముందరి కాళ్లకు వేసిన బంధమే అది.
2. వారసత్వ బలహీనత
రామోజీ రావు వారసత్వం రామోజీ రావులో పది శాతం తెగింపును కూడా ప్రదర్శించే పరిస్థితి కనిపించడం లేదు. చిన్న చిన్న కంపెనీల వారసులు కూడా ధైర్యంగా ముందుకు వెళుతంటే 50 ఏళ్ల దాటిన రామోజీ వారుసుడు ఇప్పటికీ జనం ముందుకు రాలేకపోతున్నారు. ఎవరికీ లేని మీడియా మద్దతు, డబ్బు, అవకాశాలు, తండ్రి సంపాదించిన క్రెడిబులిటీ ఉన్న దానిని ఒక శాతం కూడా వాడుకోలేకపోయారు. ఆ బాధ కూడా లే ఖలో కనిపించింది. అద్భుతమైన సంతానం అని కేటీఆర్ ను చూపుతూ కేసీఆర్ ను పొగిడారు రామోజీ ఆ లేఖలో. ఏమాటకామాటే… కేటీఆర్ తండ్రిక తగిన కొడుకుగా ఎదిగారు. మాస్ లో ఆయనకు కొంచెం ఫాలోయింగ్ తక్కువ అవ్వచ్చు గాని తండ్రి వారసత్వాన్ని కాపాడగలిగిన సమర్థుడే కేటీఆర్.
3. విశాల సామ్రాజ్యం
పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ కాకపోవడం వల్ల రామోజీ గురించి జనాలకు తెలియదు గాని ఆయనది దేశంలో ప్రముఖ వ్యాపార సంస్థ. అత్యధిక మందికి ఉపాధి కల్పించి ఇండియా టాప్ 50 కంపెనీల్లో ఒకటి. లక్షల మంది ఆయన కంపెనీల్లో పనిచేస్తున్నారు. అన్నిటికీ మూలాలు తెలంగాణలోనే ఉన్నాయి. బేసిగ్గా కాస్త కీర్తికాంక్ష ఉన్న వ్యక్తి రామోజీ. అందుకే తనకు డబ్బు వచ్చే రంగాలైన రియల్ ఎస్టేట్, ఐటీ జోలికి పోకుండా…. మీడియా, సినిమా రంగాలపై ఆసక్తి చూపారు. అందుకే తాను సృష్టించిన చరిత్రకు భావి ప్రభుత్వాల అండ ఉంటే అవి నిలబడతాయన్న ఆకాంక్ష రామోజీ చేత ఈ లేఖ రాయించి ఉండొచ్చు.
కేటీఆర్ స్మార్ట్ లీడరే కావచ్చు…. కానీ రామోజీ లాంటి వ్యక్తితో పొగిడించుకునే స్థాయిలో అయితే కేటీఆర్ లేరు. అసలు రామోజీ నుంచి ఇలాంటి లేఖ ఒకటి వస్తుందని రామోజీ టాలెంట్ ను అభిమానించే వారు ఎవరూ కలలో కూడా ఊహించిఉండరు.
కాలం కలసి రాకపోతే ఏమైనా జరగొచ్చు అన్నదే ఈ ఆర్టికల్ అంతరార్థం.