ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ఖజానా పూర్తిగా ఎండిపోయిందని చెప్పిన ఆయన.. ఈ సమయంలో మూడు రాజధానులు ఎందుకని ప్రశ్నించారు.
మూడు రాజధానులు నిర్మించడం కష్టసాధ్యమేనని కేంద్రమంత్రి అన్నారు.
రాష్ట్ర విభజన వేళలోనే ఏపీ రాజధాని అభివృద్ధికి నిధులు ఇవ్వాల్సిందన్నారు.
యూపీఏ ప్రభుత్వం దీనిని విస్మరించిందని చెప్పారు. ప్రస్తుతం అమరావతిలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని వ్యాఖ్యానించారు.
దీనికి మోడీ ప్రభుత్వం నిధులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందన్నారు.
నిధులు లేకపోతే రాజధాని నిర్మాణం ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటోందని, ప్రస్తుతం ఒక్క రాజధాని కూడా అభివృద్ధి చెందడం లేదని చెప్పారు.
అలాంటప్పుడు 3 రాజధానుల అంశం సరికాదని సూచించారు.
ఏ అంశానికైనా నిధులు ముఖ్యమని, నిధులు లేకే అమరావతి అభివృద్ధి చెందడం లేదని రామ్‌దాస్ తెలిపారు.
రాజధానిగా అమరావతి నగరాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌కి సూచించారు.
ఈ విషయంలో ప్రధానమంత్రిని కోరితే కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు సహకరిస్తుందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనపై స్పందిస్తూ… ఒక రాజధానిని అభివృద్ధి చేయడానికే రాష్ట్రానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అలాంటిది మూడు రాధానులు నిర్మించడం కష్టతరమని అథవాలే పేర్కొన్నారు.
రాష్ట్రంలోని వృద్ధాశ్రమాలకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులు మంజూరు చేస్తుందని, అందుకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధి తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ముఖ్యమంత్రి జగన్ చర్చించాలని అథవాలే సూచించారు.