రామారావు ఆన్ డ్యూటీ.. మాస్ రాజా రవితేజ కొత్త సినిమా. నూతన దర్శకుడు శరత్ మండవ ఈ సినిమాను రూపొందించగా.. పడి పడి లేచె మనసు, ఆడవాళ్ళు మీకు జోహార్లు, విరాటపర్వం చిత్రాల నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించాడు.
ఈ నెల 29నే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టైటిల్ ప్రకటించినపుడు చాలా మంచి స్పందన వచ్చింది. క్యాచీగా ఉన్న ఈ టైటిల్ జనాల్లోకి సులువుగా వెళ్లిపోయింది. ఐతే నిజానికి ఈ చిత్రానికి ముందు అనుకున్న టైటిల్ ఇది కాదట.
రచయిత, దర్శకుడు శరత్ మండవ.. ముందు గవర్నమెంట్ ఆన్ డ్యూటీ అనే టైటిల్ పెట్టాడట ఈ చిత్రానికి. అదే టైటిల్‌తో లోగో కూడా డిజైన్ చేశాడట. ఐతే కెమెరామన్ సత్యన్ సూర్యన్.. ఆ లోగో గమనించినపుడు ఆ లోగోలోనే రామారావు అనే పేరు కూడా కనిపించి.. సినిమాకు గవర్నమెంట్ ఆన్ డ్యూటీ, రామారావు ఆన్ డ్యూటీ అని రెండు టైటిళ్లు పెట్టారా అని అడిగాడట.
అప్పుడే రామారావు ఆన్ డ్యూటీ అనే టైటిల్ స్ట్రైకింగ్‌గా ఉంది అనిపించి.. రవితేజతో ఈ విషయం పంచుకున్నాడట శరత్. రవితేజ ఇంకేం ఆలోచించకుండా ఈ టైటిల్ పెట్టేయమనడం, యూనిట్లో మిగతా వాళ్లకూ నచ్చడంతో అదే ఓకే చేయడం జరిగాయట.
ఇక ఈ సినిమా జానర్ గురించి శరత్ చెబుతూ.. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పాడు. ఒక వ్యక్తి మిస్సింగ్ కేసు చుట్టూ కథ నడుస్తుందని.. సస్పెన్స్ ఎలిమెంట్ బాగా హైలైట్ అవుతుందని.. దాంతో పాటు రవితేజ మార్కు యాక్షన్, ఎమోషన్స్, హీరోయిజం కూడా ఉంటాయని అతను తెలిపాడు.
రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ నటించిన రామారావు ఆన్ డ్యూటీలో వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషించాడు. తమిళ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ సంగీతం అందించాడు.