వైసీపీ పాలనలో టిడిపి నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులను అడ్డం పెట్టుకొని టీడీపీ, జనసేన సహా ప్రతిపక్ష పార్టీల నేతలపై, కార్యకర్తలపై జగన్ కక్ష సాధిస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఎన్నోసార్లు విమర్శలు గుప్పించారు. అయినా సరే, టిడిపి శ్రేణులపై దాడులు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో 2019లో జనసేన తరఫున పోటీ చేసిన పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి జరిగిన ఘటన కలకలం రేపుతోంది.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకా అయిన పుంగనూరులో రామచంద్ర యాదవ్ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ దాడిలో ఆయనకు చెందిన వాహనాలు, వస్తువులు, ఇంటి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం అయినట్టుగా తెలుస్తోంది. పార్టీలకతీతంగా రామచంద్ర యాదవ్ తనపెట్టిన రైతు భేరి సమావేశానికి ఆయనను వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకోవడం కూడా చర్చనీయాంశమైంది. ఆ సభకు అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్నారు.
అంతేకాదు, ఆయన అనుచరులు 20 మందిని అదుపులోకి తీసుకోవడంతో వారంతా పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత రామచంద్ర యాదవ్ ను పోలీసులు విడుదల చేయడంతో ఆయన అనుచరులతో కలిసి వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. పుంగనూరులో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, సభను అడ్డుకోవడానికి పోలీస్ యాక్ట్ తెచ్చారని ఆరోపించారు. అధికారాన్ని, పోలీసులను అడ్డుపెట్టుకొని సభను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
రామచంద్ర యాదవ్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత రాత్రి ఆయన ఇంటిపై వైసీపీ కార్యకర్తలు 200 మంది వెళ్లి దాడి చేసినట్టుగా తెలుస్తోంది. రామచంద్ర యాదవ్ ఓ గదిలో తాళం వేసుకొని ప్రాణాలతో బయటపడ్డట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆలస్యంగా వచ్చిన పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి వైసిపి కార్యకర్తలను అక్కడ నుంచి చెదరగొట్టినట్టుగా తెలుస్తోంది. ఇంత జరుగుతున్న పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.