ఏపీని వరదలు ముంచెత్తడంతో అప్రమత్తమైన కూటమి సర్కార్ జాప్యం లేకుండా వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా కృష్ణమ్మ కన్నెర్రజేయడంతో విజయవాడ మొత్తం జలమయం అయింది. దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రెండున్నర రోజుల నుంచి విజయవాడలోనే పర్యటిస్తూ.. బాధితులకు అండంగా ఉంటున్నారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తూ.. అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. అయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కళ్లు తెరుచుకోలేదు. కూటమి ప్రభుత్వంపై సమయం సందర్భం లేకుండా నిప్పులు చెరుగుతూనే ఉన్నారు.
సోమవారం విజయవాడలోని సింగ్‌నగర్ ముంపు ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటించారు. వరద నీటిలోకి దిగి బాధుతులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగన్.. చంద్రబాబు సర్కారుకు దూర దృష్టి లేదని, అందుకే ప్రజలకు ఇన్ని కష్టాలు పడుతున్నారని, ఇప్పటివరకు ప్రజలకు ఏమీ చేయలేదని, పరిహారం ప్రకటించలేదని ఏవేవో విమర్శలు గుప్పించారు. అక్కడితో ఆగలేదు చంద్రబాబు ఇల్లు మునగకుండా ఉండేందుకు బుడమేరు వాగులోకి నీళ్లు మళ్లించారంటూ జగన్ ఆరోపణలు చేశారు.
అయితే జగన్ విమర్శలపై తాజాగా కేంద్ర మంత్రి, టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు స్పందించారు. కష్టకాలంలో వరద బాధితులను ఆదుకోవాల్సింది పోయి.. ప్రభుత్వంపై ఇష్టానుసారం విమర్శలు గుప్పిస్తున్నారని జగన్ పై రామ్మోహన్ మండిపడ్డారు. చంద్రబాబు ఇంటికి, బుడమేరు కి సంబంధం ఏమిటి..ఆ మాత్రం జ్ఞానం కూడా లేకపోతే ఎలా అంటూ జగన్‌ను ఎద్దేవ చేశారు. విపత్తుల సమయంలో ఎలా పని చేయాలో చంద్రబాబును చూసి పులివెందుల ఎమ్మెల్యే గారు నేర్చుకోవాలని రామ్మోహన్ సూచించారు. రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఈ సందర్భగా రామ్మోహన్ వెల్లడించారు.