చెర్రీ అలియాస్ రాంచరణ్ సినిమాలతో పాటు ట్రూ జెట్ పేరుతో విమానయాన సంస్థను షురూ చేయటం తెలిసిందే. 2015లో తన స్నేహితులతో కలిసి ప్రారంభించిన ఈ వ్యాపారాన్ని అప్పటి ఏవియేషన్ మంత్రి అశోక్ గజపతి రాజు చేతల మీదుగా ప్రారంభించారు. ఈ సంస్థ గురించి అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విమానయాన వ్యాపారం అంత తేలికైన విషయం కాదు. వేలాది కోట్లు ఉన్నా.. ఇట్టే కరిగించే సత్తా ఈ వ్యాపారానికే ఉంది. విమానయాన సంస్థల్ని ఏర్పాటు చేసిన ఎందరో దారుణంగా దెబ్బ తిన్నారు.
అలాంటి వ్యాపారంలోకి చెర్రీ ఎంట్రీ ఇవ్వటం అప్పట్లో ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు.. చాలామంది చెర్రీని అలెర్టు చేసినట్లుగా చెబుతారు. కొత్త వ్యాపారాన్నిప్రారంభించే సమయంలో అందరూ లెక్కల గురించి మాట్లాడటం.. పాజిటివ్ గా ఉండటం తెలిసిందే. ఇందుకు చెర్రీ సైతం మినహాయింపు కాదు. అంచనాలకు తగ్గట్లే.. చెర్రీ ఈ వ్యాపారంలో నష్టపోయాడు. ఆశించినంతగా ఫలితాలు లేకపోవటం.. నిర్వహణ విషయంలో చతికిల పడటంతో పాటు.. ట్రూజెట్ బుకింగ్స్ అంతంతమాత్రంగా ఉండటం.. మొత్తంగా ఈ సంస్థ ఇటీవల తన కార్యకలాపాల్ని నిలిపివేసినట్లుగా పేర్కొనటం తెలిసిందే.
అయితే.. దీనిపై పెద్ద ఎత్తున వార్తలు రావటం.. సంస్థను మూసేసినట్లుగా కొన్నిచోట్ల రాయటంతో ట్రూ జెట్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి సేవల్ని నిలిపివేశామే తప్పించి.. వ్యాపారాన్ని పూర్తిగా మూసేయలేదని.. అవన్నీ తప్పుడు వార్తలుగా పేర్కొంది. ఇదిలా ఉంటే.. రాంచరణ్ ప్రస్తుతం ముంబయిలోని టాటా ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. దాదాపుగా వెయ్యికోట్ల రూపాయిలతో మొదలైన ఈ సంస్థ చాలా త్వరగానే అప్పుల ఊబిలో మునిగిపోవటం.. డొమెస్టిక్ సేవలు అందించే ఇతర విమానయాన సంస్థలతో పోటీ పడలేకపోవటం లాంటి వాటితో జరిగిన నష్టం భారీగా మారింది.
ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికిప్పుడు ఈ సంస్థను పునరుద్ధరించాలంటే రూ.100 – 150 కోట్ల మధ్య పెట్టుబడులు అవసరమవుతాయని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టాటా తో చేతులు కలపటం ద్వారా.. సంస్థను తిరిగి యాక్టివ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు ఆర్ఆర్ఆర్.. మరోవైపు తన తండ్రితో నిర్మించిన ఆచార్య మూవీని రిలీజ్ చేసే విషయంలోనూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మొత్తంగా ఈ చికాకుల నుంచి బయటపడటానికి మరికొంత సమయం పడుతుందన్న మాట వినిపిస్తోంది.