సరిగ్గా మూడేళ్లు. ఆ మాటకు వస్తే మరో మూడు రోజులు అదనమనే చెప్పాలి. 2019 జనవరి 11న వినయ విధేయ రామతో సంక్రాంతి బరిలోకి దిగారు రాం చరణ్. అయితే.. ఈ మూవీ విజయాన్ని సాధించలేదు. కట్ చేస్తే.. ఆ తర్వాత మళ్లీ సినిమా లేదు.
దిగ్గజ దర్శకుడు జక్కన్న అలియాస్ రాజమౌళి నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ కోసం భారీగా కాల్షీట్లు ఇవ్వటం.. ఆ మూవీ తర్వత మరో మూవీ అన్న ఉద్దేశంతో ఆగిన వైనం.. కాలగర్భంలో మూడేళ్ల విలువైన కాలం కరిగిపోయేలా చేసింది. ఆర్ఆర్ఆర్ ను విడుదల చేయాలని చూడటం.. అనుకోని రీతిలో అవాంతరాలు ఎదురుకావటంతో నేటికి అది బయటకు రాలేదు. సరైన సమయంలో ఈ మూవీ ఉంటుందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. తన కొత్త ప్రాజెక్టుల్ని స్పీడప్ చేయటమే కాదు. వాటి రిలీజ్ విషయంలోనూ చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు రాంచరణ్. ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ నటిస్తున్న మూవీ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు. దీన్ని ఆర్ సీ 15గా వ్యవహరిస్తున్నారు. టైటిల్ ను ఇంకా ఫైనల్ చేయలేదు. ఈ మూవీలో చరణ్ తో జత కడుతోంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. శంకర్ సినిమా అంటేనే సంచలనంగా ఉంటుంది.
అందులోనూ పొలిటికల్ థ్రిల్లర్ అంటే.. ఈ మూవీ ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పక తప్పదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు ఎఫ్పుడు వస్తుందన్నది చాలా తొందరపాటే. కానీ..ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుగానే కర్చీఫ్ వేసుకోవటం మంచిదన్న ఉద్దేశంతో.. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని ప్రకటించటం ఆసక్తికరంగా మారింది.
ఈ మూవీ రాంచరణ్ కు15వ సినిమా. ఆర్ఆర్ఆర్ తో వచ్చే ఇమేజ్ ను పరిగణలోకి తీసుకొని.. శంకర్ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో రాంచరణ్ ను సరికొత్త లుక్ తో చూపిస్తున్నారు శంకర్. పవర్ ఫుల్ కలెక్టర్ గా.. ముఖ్యమంత్రిగా రెండు పాత్రల్లో వేరియేషన్ చూపిస్తారని చెబుతున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ మీద అంచనాలు భారీగా ఉన్నాయి.
దీనికి తోడు..వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసే ఈ మూవీని.. మిగిలిన వారి కంటే ముందుగా ప్రకటన చేయటం ద్వారా.. సంక్రాంతి రేసులో తువ్వాలు వేసేసినట్లే అవుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈసారి సంక్రాంతికి ఏమీ లేకున్నా.. వడ్డీతో సహా వచ్చే ఏడాది తీర్చేస్తానని ఊరిస్తున్నట్లుగా ఉంది చెర్రీ మూవీ. ఆర్ ఆర్ఆర్ విడుదలతో నిరాశతో ఉన్న చెర్రీ అభిమానులకు తాజా సమాచారం కాసింత ఊరట కలిగిస్తుందని చెప్పక తప్పదు.