ఆర్ఆర్ఆర్ మూవీతో గొప్ప పేరు సంపాదించడమే కాక.. తన మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెంచుకున్నాడు రామ్ చరణ్. దీని తర్వాత అతను తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అయ్యాక జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో మెగా పవర్ స్టార్ ఓ ప్రాజెక్టు చేయాల్సింది. కానీ అనివార్య కారణాలతో ఆ సినిమా క్యాన్సిల్ అయినట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
మరి శంకర్ తర్వాత ఏ దర్శకుడితో చరణ్ జట్టు కడతాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందు లోకేష్ కనకరాజ్ పేరు వినిపించింది. అయితే ఇప్పుడు కొత్తగా ఒక కన్నడ దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. అతడి పేరు నర్తన్.
కన్నడలో 2017లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన ముఫ్తి మూవీతో నర్తన్ కన్నడనాట మారుమోగింది. అతను అక్కడ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యాడు. కేజిఎఫ్ తర్వాత యశ్ సైతం సినిమా చేయాలనుకున్నది అతడితోనే. ఈ కాంబో ఓకే అనుకుంటుండగా ఇప్పుడు నర్తన్.. చరణ్ తో సినిమా చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
నర్తన్ ఇటీవల ఈ మెగా హీరోను కలిసి ఓ కథ చెప్పినట్లు సమాచారం. చరణ్ కు ఆ కథ బాగా నచ్చిందని… అది తన ఇమేజ్ కు ఉపయోగపడే యాక్షన్ స్టోరీ కావడంతో పచ్చజెండా ఊపేశాడని అంటున్నారు. ఇది ఆటోమేటిక్గా పాన్ ఇండియా సినిమా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా చరణ్- యశ్ కాంబినేషన్లో నర్తన్ మల్టీస్టారర్ చేసే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.