సోషల్ మీడియా కాలంలో సినిమా అనౌన్స్మెంట్ దగ్గర్నుంచే ప్రమోషన్లు మొదలైపోతాయి. అలాగే అభిమానులను ఎంగేజ్ చేస్తూ తరచుగా ఏదో ఒక అప్డేట్ ఇస్తుండాలి. ఆ అప్డేట్స్ కూడా ఆసక్తి రేకెత్తించేలా ఉండాలి. అప్పుడే సినిమాకు కోరుకున్న హైప్ వస్తుంది. ఐతే అన్ని సినిమాలకూ ఇలాగే చేయాలనేమీ లేదు.
పెద్ద సినిమాల చిత్ర బృందాలు ప్రశాంతంగా తమ పని తాము చేసుకోకుండా అభిమానులు అప్డేట్స్ అప్డేట్స్ అంటూ గోల చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఆ అభిమానులను ఊరించి ఉస్సూరుమనిపిస్తే మాత్రం తప్పు నిర్మాతలదే అవుతుంది. ‘గేమ్ చేంజర్’ అనే సినిమా విషయంలో ఇలా జరగడం రామ్ చరణ్ అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురి చేసి.. ఒక దశలో ఆ సినిమా గురించి మాట్లాడ్డమే మానేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ ఇంతకంటే ఘోరంగా తయారైంది. ఈ సినిమా మొదలై దాదాపు నాలుగేళ్లు కావస్తోంది. కానీ ఇప్పటికీ పూర్తి కాలేదు. భారీ చిత్రం.. పవన్ కళ్యాణ్‌కు వేరే కమిట్మెంట్లు చాలా ఉన్నాయి. వీటి మధ్య ఈ సినిమాను పూర్తి చేయడం కష్టమవుతోంది. అందుకే రిలీజ్ లేటవుతోంది. అభిమానులు కూడా విషయం అర్థం చేసుకుని ఈ సినిమా విషయంలో మౌనం వహిస్తున్నారు.
ఐతే సైలెంటుగా వాళ్ల పనిలో వాళ్లుంటే.. నెల కిందట నిర్మాత ఏఎం రత్నం వారిని కదిలించాడు. ‘హరిహర వీరమల్లు’కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరిగిపోతున్నాయని.. అతి త్వరలో అభిమానుల కోసం మంచి ట్రీట్ ఇవ్వబోతున్నామని ప్రకటించాడు. కానీ తర్వాతి కొన్ని వారాల్లో చప్పుడు లేదు. ఇక శివరాత్రికే విందు అని ఫిక్సయిపోయారు అభిమానులు.
ఏదైనా విశేషం పంచుకోవడానికి ఇంతకంటే మంచి సందర్భం లేదు. కానీ ‘హరిహర వీరమల్లు’ టీం నుంచి సౌండే లేదు. ఇంతకుముందు ఒకసారి మీడియాను కలిస్తే.. ‘హరిహర వీరమల్లు’ త్వరలోనే పూర్తవుతుందని.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోపే రిలీజ్ కూడా అవుతుందని ధీమాగా ప్రకటించాడు రత్నం. కానీ అది నిజం కాలేదు. ఇప్పుడేమో అప్డేట్ అని ఊరించి సైలెంట్ అయిపోయారు. ప్రతిసారీ ఇలా ఫాల్స్ హోప్స్ ఇస్తుంటే అభిమానులు నిర్మాతను ఇంకేం నమ్ముతారు?