టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ ఇపుడు తెలంగాణతో పాటు టాలీవుడ్ లోను హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ అప్రువర్ గా మారి ఇచ్చిన సమాచారంతో ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ మొదలుబెట్టింది. మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులివ్వగా ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి విచారణకు హాజరయ్యారు. అయితే, సెప్టెంబరు 6న హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
కానీ, తాను ఆ రోజు విచారణకు రాలేనని ఈడీ అధికారులకు రకుల్ సమాచారమిచ్చింది. సెప్టెంబరు 3వ తేదీనే విచారణకు హాజరవుతానని, అందుకు అనుమతివ్వాలని ఈడీ అధికారులకు రకుల్ మెయిల్ పెట్టగా వారు సానుకూలంగా స్పందించారు. బ్యాంకు స్టేట్ మెంట్లతోపాటు, సంబంధిత డాక్యుమెంట్స్‌తో విచారణకు హాజరు కావాలని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈడీ విచారణకు రకుల్ నేడు హాజరైంది. ఉదయం 10:30కు ఈడీ కార్యాలయానికి రావాలని రకుల్ కు చెప్పగా…ఆమె 9:10కే ఈడీ కార్యాలయానికి చేరుకోవడం విశేషం.
చేతిలో ఓ ఫైల్ తో తన చార్టెడ్ అకౌంటెంట్, న్యాయవాది, మేనేజర్‌తో కలిసి రకుల్ ఈడీ ఆఫీసుకు వచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ సెక్షన్ 2, 3 ప్రకారం రకుల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసి విచాచణ చేపట్టింది. డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, డ్రగ్ పెడ్లర్ కెల్విన్ తో పరిచయాలు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలపై విచారణ జరగనుందని తెలుస్తోంది. వాస్తవానికి 2017లో జరిగిన ఎక్సైజ్ విచారణలో రకుల్ పేరు లేదు. కానీ, ఇటీవల అప్రువర్ గా మారిన కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో రకుల్ కు డ్రగ్స్ కేసుతో పలు లింకులున్నట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది.
అంతకుముందు, బాలీవుడ్ దివంతగ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసులో బాలీవుడ్–డ్రగ్స్ సంబంధాల నేపథ్యంలోనూ రకుల్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్‌ను 10 గంటలు, చార్మిని ఎనిమిది గంటల పాటు విచారించిన ఈడీ రకుల్‌ను ఎన్ని గంటలు విచారణ జరుపుతారన్నది ఆసక్తికరంగా మారింది.