సూపర్ స్టార్ రజినీకాంత్‌కు, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ఓ వివాదం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న రజినీని తమిళనాట అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, దాన్ని తెర వెనుక ఉండి నడిపిస్తున్న భారతీయ జనతా పార్టీ కలిసి ఉద్దేశపూర్వకంగా రజినీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయన్న ఆరోపణలు కొంత కాలంగా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో చెన్నైలో రజినీకాంత్‌కు చెందిన రాఘవేంద్ర కళ్యాణ మండపానికి భారీ స్థాయిలో గ్రేటర్ చెన్నై మునిసిపల్ కార్పొరేషన్ ఆస్తి పన్ను వేయడం చర్చనీయాంశంగా మారింది. లాక్ డౌన్ టైంలో అసలు పని చేయకుండా ఉన్న తన కళ్యాణ మండపానికి ఏకంగా రూ.6.5 లక్షల ఆస్తి పన్ను వేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రజినీకాంత్ కోర్టును ఆశ్రయించడం గమనార్హం.
రజినీకి ఆరున్నర లక్షలు కట్టడం పెద్ద విషయం కాదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా తన కళ్యాణ మండపానికి భారీగా ఆస్తిపన్ను విధించడంపై ఆయన న్యాయబద్ధంగా పోరాడాలని, దీనిపై జనాల్లో చర్చ జరగాలని భావించినట్లున్నారు. ఈ ఏడాది మార్చి 24వ తేదీ నుంచి తాను ఈ కల్యాణ మండపంలో ఎలాంటి కార్యక్రమాలను చేపట్టలేదని, అయినప్పటికీ పన్ను చెల్లించాలంటూ గ్రేటర్ చెన్నై అధికారులు నోటీసులు పంపించారని రజినీకాంత్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ ఏడు నెలల కాలంలో కల్యాణ మండపం ద్వారా తనకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదని రజినీ అంటున్నారు. ఏడాదిలో వరుసగా 30 రోజులు లేదా అంతకు మించిన కాలం పాటు ఖాళీగా ఉండాల్సి వస్తే చెన్నై మున్సిపల్ యాక్ట్-1919 ప్రకారం ఆస్తి పన్ను చెల్లించనక్కర్లేదని, ఖాళీగా ఉన్న కాలంలో ఆక్యుపెన్సీ నమోదైన శాతం వరకే పన్నును చెల్లించాల్సి ఉంటుందని రజినీకాంత్ లా పాయింట్ తీశారు. దీనికి విరుద్ధంగా ఏప్రిల్-సెప్టెంబరు కాలానికి అధికారులు రూ.6.5 లక్షలు పన్ను విధించడం ఎంత వరకు సమంజసం అని రజినీ తన పిటిషన్లో ప్రశ్నించారు. ఈ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు విచారణకు స్వీకరించింది.