టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సర్కారు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో 341 కోట్ల రూపాయల కుంభ కోణం జరిగిందని పేర్కొంటూ అరెస్టు చేయడం, ఆయనను రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం తెలిసిందే. అయితే, అనూహ్యంగా ఇప్పుడు జైలు పరిణామాలు మారిపోయాయని అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబును ఉంచిన రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్. రాహుల్ సడెన్‌గా సెలవు పెట్టారు.
సూపరింటెండెంట్ రాహుల్ సతీమణికి అనారోగ్యం చేయడంతో ఆమెను దగ్గరుండి చూసుకునేందుకు వీలుగా ఆయన సెలవు పెట్టారని జైలు వర్గాలు అధికారికంగానే ప్రకటించాయి. దీంతో చంద్రబాబు పిటిషన్లు హైకోర్టులో విచారణకు వచ్చే ఈ నెల 19వ తేదీ వరకు(ఇది అనూహ్యమే) రాహుల్ సెలవుపై వెళ్లారు. అంటే.. చంద్రబాబు జైలులో ఉండే ఈ నాలుగు రోజులు(హైకోర్టు బెయిల్ ఇస్తే…) రాహుల్ స్థానంలో జైళ్ల శాఖ కోస్తా జిల్లాల డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ రవికిరణ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
ప్రస్తుతం రవికిరణ్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక.. వెనువెంటనే రాత్రికి రాత్రి వచ్చి జైలులో ఉన్న పరిణామాలు, ఇతరత్రా పరిస్థితులను ఆయన పర్యవేక్షించినట్టు జైలు వర్గాలు అనధికారికంగా పేర్కొన్నాయి. అయితే.. ఇప్పుడు రవికిరణ్రెడ్డిపై ఆసక్తికర చర్చ తెరమీదికి వచ్చింది. ఈయన స్వయానా వైసీపీ నాయకుడు, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి మేనల్లుడని, బుగ్గన అక్క కుమారుడని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
చంద్రబాబును జైలులో ఉంచిన నేపథ్యంలో రాహుల్ సెలవుపై వెళ్లినా.. ఆయన స్థానంలో వేరేవారికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా.. రాజకీయంగా ప్రభావితం చేయగల.. రవికిరణ్రెడ్డికి బాధ్యతలు అప్పగించిందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ములాఖత్ పిటిషన్ తిరస్కరించింది కూడా రవికిరణ్ రెడ్డేనని ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందన్నది టీడీపీ నాయకుల విమర్శ. అయితే.. దీనిపై వాస్తవం ఏంటనేది జైళ్ల శాఖ వెల్లడించాల్సి ఉంది.