95వ ఆస్కార్ వేడుకల్లో తెలుగుజాతి గర్వపడేలాగా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు పాట ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా అవార్డు దక్కిన తర్వాత తొలిసారిగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి స్పందించారు. తమ పాటకు ఆస్కార్ రావడం ఎంతో సంతోషంగా ఉందని, ఇదో ఎమోషనల్ మూమెంట్ అని అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇండియాకు ప్రాతినిథ్యం వహించిందని తారక్ చెప్పారు.
‘కంగ్రాచ్యులేషన్స్ కీరవాణి సర్ జీ, జక్కన్న (రాజమౌళి), చంద్రబోస్ గారు’ అని తారక్ ట్వీట్ చేశారు. “మేము సాధించాం.. ఎమ్ఎమ్ కీరవాణి, జక్కన్న, చంద్రబోస్ సహా యావత్ టీమ్‌కు ధన్యవాదాలు” అంటూ జూ.ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఇక, నాటు నాటు పాటకు అవార్డు దక్కడంపై రామ్ చరణ్ కూడా స్పందించారు. “మేం గెలిచాం!! ఇండియన్ సినిమాగా గెలిచాం!! ఒక దేశంగా గెలిచాం!! ఆస్కార్ అవార్డ్ ఇంటికి వస్తోంది..” అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
తన భార్య ఉపాసన 6 నెలల గర్భవతి అని, పుట్టబోయే బిడ్డ తమకు చాలా అదృష్టాన్ని తెస్తోందని అన్నారు. పుట్టబోయే బిడ్డకు ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏముంటుందని చెప్పారు. ఈ పాటకు పనిచేసిన టెక్నీషియన్లందరికీ చరణ్ శుభాకాంక్షలు తెలిపారు. మరోసారి ఎన్టీఆర్ తో కలిసి నటించాలని, ఇంతకన్నా పెద్ద హిట్ అయ్యే పాటలో కలిసి స్టెప్పులు వేయాలని ఆకాంక్షించారు.
తమ సినిమాలోని పాటకు ఆస్కార్ దక్కడంపై దర్శకుడు రాజమౌళి ఎమోషనల్ అయ్యారు. “నిజంగా ఇది ఓ కలలానే ఉంది. మాకు అవార్డు వస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నాం. అదే నిజమైంది. మీ జీవితంలో అత్యంత గొప్ప క్షణం మీ సినిమా అవార్డు గెలుచుకోవడమా? లేక ఆస్కార్ వేదికపై మీ సినిమాలోని పాటను ప్రదర్శించడమా అంటే చెప్పడం చాలా కష్టం. రెండింటినీ చూడటం సంతోషంగా ఉంది.
సాంగ్ పెర్ఫామెన్స్ చేస్తున్నంత సేపూ ఆడియన్స్ చప్పట్లు కొడుతూనే ఉన్నారు. పూర్తయ్యాక స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇది చూసి ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎక్కినట్లు అనిపించింది. ఆస్కార్ అవార్డు.. కీరవాణిని ఆ స్థాయికి చేర్చింది’’అని జక్కన్న భావోద్వేగానికి గురయ్యారు.