లావణ్య ఇష్యూ తర్వాత హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు సినిమా కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో కూడా రాజ్ తరుణ్ కనిపించలేదు. అయితే ఫైనల్ గా ఈ టాలీవుడ్ హీరో మీడియా ముందుకు వచ్చాడు. త్వరలో విడుదల కాబోయే తన అప్ కమింగ్ ఫిల్మ్ `తిరగబడరా స్వామి` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో కలిసి రాజ్ తరుణ్ పాల్గొన్నాడు.
అయితే ఈ సందర్భంగా మీడియా లావణ్య పెట్టిన కేసు గురించి అనేక ప్రశ్నలు సంధించడంతో.. రాజ్ తరుణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. `తప్పుడు ఆరోపణలు చేసేవాళ్ళు మాత్రమే తరచూ బయటకు వచ్చి మాట్లాడతారు. నేను లీగల్ గానే ముందుకు వెళ్తున్నాను. చట్టపరంగా చర్యలు తీసుకుంటా. ఆమె ఆరోపణలు చేసినప్పుడే నేను మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చాను. నేను చెప్పిందంతా నిజం. నా దగ్గర కూడా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. నేనింకా బయటపెట్టలేదంతే. ఆమె పెట్టిన ఎఫ్ఐఆర్ లో గర్భస్రావంపై కేసు లేదు. అవి ఆరోపణలు మాత్రమే. పోలీసుల నుంచి నాకు నోటీసులు వచ్చాయి.. వాటికి రెస్పాండ్ కూడా అయ్యాను` అంటూ రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు.
లావణ్య వివాదం తర్వాత ఎందుకు బయటకు రావట్లేదు అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. `నేను మనిషినే, నాకు బాధ కలుగుతుంది. ఆ ఇష్యూ వల్ల నేను చాలా ఎఫెక్ట్ అయ్యాను. మా పేరెంట్స్, ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతున్నారు. నేను మామూలుగానే సెన్సిటివ్ పర్సన్. మన మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ఇలా చేస్తే బాధ వేయదా? ఆ బాధతోనే ఇన్నాళ్లు బయటకు రాలేదు. ఆమె లాగా పదే పదే నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేను. ఈ రోజు కూడా నేను చాలా ధైర్యం తెచ్చుకొని మీ ముందుకు వచ్చాను. ఇక ఇలాంటివి అడిగి బాధపెట్టకండి` అంటూ రాజ్ తరుణ్ పేర్కొన్నాడు.