గత నెల 25న రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సొమ్ము జమ29న రైతు భరోసా చెల్లింపులంటూ మీట నొక్కిన జగన ముందే సంక్రాంతి వచ్చేసిందంటూ ప్రచారార్భాటం మళ్లీ నగదు పడుతుందేమోనని రైతన్నల ఎదురుచూపులుఅంతా వట్టిదేనని తేలడంతో ఉసూరునిరుడు అక్టోబరులోనూ ఇదే తరహా ప్రచారం జగన్ ప్రభుత్వం ప్రచారం కోసం పచ్చి మోసానికి పాల్పడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. కేంద్రం నుంచి రైతులకు అందే సాయం తానే ఇస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకొంటోంది. వైఎస్సాఆర్ రైతుభరోసా-పీఎం కిసాన సమ్మాన్ పథకంపై వారిని మాయజేసేలా ప్రచారం చేస్తోంది. రైతుల ఖాతాల్లో జమ అయిన సొమ్ముకు మళ్లీ బటన నొక్కి ముఖ్యమంత్రి అభాసుపాలయ్యారు. పైగా దీనికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రకటనలు ఇవ్వడంపై అన్నదాతలు విస్మయం చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జనవరిలో కేంద్రం జమ చేయాల్సిన పీఎం కిసాన మూడో విడత కిస్తీ రూ.2వేలను డిసెంబరు 25నే విడుదల చేసింది. అదే రోజు చాలా మంది రైతుల ఖాతాల్లోకి ఆ సొమ్ము చేరింది. కానీ జనవరిలో ఇవ్వాల్సిన రైతుభరోసా సొమ్మును ముందే ఇస్తున్నాం..
రైతులకు సంక్రాంతి ముందే వచ్చేసిందంటూ జగన్ సర్కారు భారీ వ్యయంతో ప్రచార ప్రకటనలు గుప్పించింది. నివర్ తుఫానతో పంట నష్టపోయిన రైతులకు ఇనపుట్ సబ్సిడీతో పాటు రైతుభరోసా మూడో విడత కిస్తీని నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నామంటూ సీఎం డిసెంబరు 29న కంప్యూటర్లో బటన కూడా నొక్కారు. కానీ తుఫానకు పంట నష్టపోయిన కొంత మంది రైతులకు మాత్రమే ఇనపుట్ సబ్సిడీ జమ చేశారు. అదీ కూడా విపత్తుల పరిహార నిధి మార్గదర్శకాల కంటే తక్కువగానే చెల్లించారు. అదలా ఉంటే.. దేశంలో ఎక్కడా లేని విధంగా కేంద్రం ఇచ్చేసిన పీఎం కిసాన ఆఖరి కిస్తీకి వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా సొమ్ము అంటూ ప్రచారం చేసుకుంది. వాస్తవంగా పీఎం కిసాన్ పథకంతో సంబంధం లేకుండా రైతు భరోసా కింద ఏటా ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.12,500 ఇస్తామని సీఎం ప్రకటించారు. అయితే కేంద్రం రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో ఇచ్చే ఆరు వేలను కూడా ఇందులో కలిపేశారు. దీనిపై విమర్శలు రావడంతో మరో వెయ్యి పెంచి రూ.13,500 ఇస్తామని చెప్పారు.
ఈ పథకాన్ని సంయుక్తంగా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కేంద్రం ఈ పథకంతో నిమిత్తం లేకుండా పీఎం కిసాన విడతల వారీ సొమ్మును విడిగా.. నేరుగా రైతుల ఖాతాలకు జమ చేస్తూనే ఉంది. అందులో భాగంగా జనవరిలో ఇస్తామని ప్రకటనించిన కిసాన సమ్మాన పథకం మూడో కిస్తీ రూ.2వేలను కేంద్రం గత డిసెంబరు 25న దేశవ్యాప్తంగా లబ్ధిదారుల ఖాతాలకు విడుదల చేసింది. ఆరోజు ప్రధాని మోదీ పేరుతో సంక్షిప్త సందేశాలు కూడా చాలా మంది రైతులకు వచ్చాయి. అయినా అదే సొమ్ముకు నాలుగు రోజుల తర్వాత రైతు భరోసా కిస్తీ అంటూ 29న సీఎం మీట నొక్కారు. దీంతో ఆ సొమ్ము కూడా తమ ఖాతాల్లో పడుతుందని రైతులు ఆశించారు. కానీ పడకపోవడంతో బ్యాంకులను సంప్రదించారు. రాష్ట్రప్రభుత్వం పైసా ఇవ్వలేదని.. అదంతా ప్రధాని మోదీ 25న ఖాతాల్లో వేసిన సొమ్మేనని బ్యాంకుల సిబ్బంది అసలు నిజం చెప్పారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వ మోసం అన్నదాతలకు అర్థమైంది. నిజానికి గత అక్టోబరులోనూ జరిగింది. ఆగస్టులోనే కేంద్రం రెండో విడత కిస్తీ రూ.2 వేలు కేంద్రం చెల్లించగా, అప్పుడూ రూ.4వేలు చొప్పున రైతుభరోసా సొమ్ము ఇస్తున్నామంటూ సర్కారు ప్రకటనలు చేసింది. ఏటా జనవరిలో పంట కోత ఖర్చులకు రూ.2వేలు వేస్తామన్న కేంద్రం..
రైతు సంఘాల ఆందోళన నేపథ్యంలో డిసెంబరులో 25నే విడుదల చేసింది. వాస్తవంగా రైతు భరోసా- పీఎం కిసాన పథకంలో ఖరీఫ్ ప్రారంభంలో పంటల పెట్టుబడికి మే నెలలో రూ.5,500, అక్టోబరులో రబీ పంటల సాగుకు రూ.2వేలు చొప్పున రూ.7,500 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని, ఈ రెండు సమయాల్లో కేంద్రం రూ,రెండేసి వేలు చొప్పున, అలాగే జనవరిలో పంట కోతలకు రూ.2వేలు కేంద్రం ఇస్తుందని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే ఈ ఏడాది కరోనా వల్ల రైతులకు ముందే సాయం అందించాలని కేంద్రం 2020 ఏప్రిల్ 13, ఆగస్టు9న రెండు కిస్తీలు విడుదల చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము ఏమీ లేకపోయినా, నివర్ తుఫాన నష్టానికి ఇనపుట్ సబ్సిడీతో పాటు రైతుభరోసా మూడో విడత కిస్తీ ఇస్తున్నామంటూ కేంద్రం సొమ్ముకు రైతు భరోసా పేరుతో జగన సర్కారు ఆర్భాటం చేసింది. పైగా సంక్రాంతి ముందే వచ్చిందంటూ విచిత్రంగా ప్రచారం చేసింది. ఏపీ ప్రభుత్వం చెప్పిన తేదీ కంటే ముందే రైతుల ఖాతాలకు పీఎం కిసాన సొమ్ము జమ అయ్యాక సీఎం ఎందుకు మీట నొక్కారు? జగన మీట నొక్కితే రైతుల ఖాతాలకు రైతు భరోసా పేరుతో రూ.2వేలు ఎందుకు జమ కాలేదు? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసుకోవాల్సిన ప్రచారాన్ని వైసీపీ సర్కారు ప్రచారమెలా చేసుకుంది? జమ అయిన సొమ్ముకు బటనెలా నొక్కారు. సీఎం స్థాయి వ్యక్తి బటన నొక్కడమెందుకు? అన్న చర్చ రైతు వర్గాల్లో జరుగుతోంది.
అధికారిక ప్రకటనల్లోనూ గజిబిజీ
నిరుడు మేలో రూ.7,500 చొప్పున 49.45 లక్షల మంది రైతులకు రూ.3,713 కోట్లు, అక్టోబరులో రూ.4వేల చొప్పున 50.47 లక్షల మంది రైతులకు రూ.2,095కోట్లు. డిసెంబరులో రూ.2వేలు చొప్పున 51.59 లక్షల మంది రైతులకు రూ.1,120 కోట్ల చెల్లింపులంటూ డిసెంబరు 29న జగన్ ప్రభుత్వం పత్రికలు, టీవీల్లో ప్రకటనలిచ్చింది. కానీ అక్టోబరులో అదే రైతుల సంఖ్యకు మొదటి విడత రూ.4,690 కోట్లు, రెండో విడత రూ.1115కోట్లు చెల్లిస్తున్నట్లు ప్రకటనలు చేసింది. అక్టోబరు ప్రకటనలో తొలి కిస్తీ కింద 49.45లక్షల మందికి రూ.4,690కోట్లు అని చెప్పి, డిసెంబరు ప్రకటనలో రూ.3,713 కోట్లే చెల్లించినట్లు చూపారు. అలాగే అక్టోబరు నెల కిస్తీ కింద 50.47లక్షల రైతులకు రూ.2095 కోట్లు అని చెప్పి, ఇప్పుడు అంతే మంది రైతులకు రూ.1120 కోట్లే చెల్లించినట్లు ప్రకటించారు. ఈ లెక్కల్లో వ్యత్యాసాలేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.