దేశంలో కరోనా బారినపడుతున్న ప్రముఖుల జాబితా పెరుగుతూనే ఉంది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ కాగా.. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి కరోనా సోకింది. ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించిన రాహుల్.. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నట్టు తెలిపారు.
ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా.. ఇటీవల పలు ప్రచార సభల్లో రాహుల్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. ఈ పరిణామంతో కాంగ్రెస్ అధిష్టానం ఉలిక్కిపడింది.
దేశంలో వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బంగాల్లో ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు రాహుల్ గాంధీ. ఇక, రాహుల్ కు కరోనా రావడంపై ప్రధాని నరేంద్ర మోడీ రియాక్ట్ అయ్యారు. రాహుల్‌గాంధీ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
మరోవైపు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ కూడా తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్‌శర్మకు కూడా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్‌చంద్ర, ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కూడా వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఇద్దరూ ఇంటి నుంచి పని(వర్క్ ఫ్రమ్ హోం) చేస్తున్నట్లు ఈసీ ఓ ప్రకటనలో తెలిపింది. గత వారమే సీఈసీ సుశీల్ చంద్ర బాధ్యతలు చేపట్టారు.
ఇలా.. మొత్తంగా.. దేశం అంతా కూడా కరోనా గుప్పిట్లో ఉండిపోయిందనే విషయంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. దీంతోపలు రాష్ట్రాల్లో స్వచ్ఛందంగానే వ్యాపార వర్గాలు సమయ వేళలను కుదించుకున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో వారాంతకు లాక్డౌన్లు అమలు చేస్తుండడం గమనార్హం. ఎలా చూసుకున్నా.. దేశంలో కరోనా తీవ్రత బెంబేలెత్తిస్తోందని అంటున్నారు పరిశీలకులు.