టాలీవుడ్ నటి, మాజీ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇరు తెలుగు రాష్ట్రాలలో తన సినిమాల కంటే వివాదాలతోనే పూనమ్ కౌర్ పేరు ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఈ నేపథ్యంలోనే కొంతకాలంగా సినిమాలతో పాటు మీడియాకు కూడా పూనమ్ దూరంగా ఉంటున్నారు. అయితే, తాజాగా హఠాత్తుగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్రలో పూనమ్ కౌర్ ప్రత్యక్షం కావడం హాట్ టాపిక్ గా మారింది.
మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పూనమ్ నడిచారు. దీంతో, పూనమ్ కౌర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఊహాగానాలు వచ్చాయి. రాహుల్ గాంధీతో పూనం భేటీ రాజకీయపరమైనదంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీని తాను ఎందుకు కలిశానో పూనం వెల్లడించారు.
చేనేత వస్త్రాలపై జిఎస్టి పన్ను రద్దు కోసం జరుగుతున్న పోరాటం నేపథ్యంలోనే తాను రాహుల్ గాంధీని కలిశానని పూనమ్ వెల్లడించారు. చేనేత వస్త్రాలపై జిఎస్టి రద్దు కోరుతూ అఖిలభారత పద్మశాలి సంఘం గత ఎనిమిది నెలలుగా ఉద్యమం చేస్తుందని, ఆ ఉద్యమంలో తాను యాక్టివ్ గా పాల్గొంటున్నానని పూనం తెలిపారు. ఈ క్రమంలోనే ఆ జిఎస్టి రద్దు కోసం ఎంపీల సంతకాలు సేకరిస్తున్నానని, ఇప్పటిదాకా 11 పార్టీలకు చెందిన 66 మంది ఎంపీల సంతకాలు సేకరించానని చెప్పారు.
అందుకే, ఎంపీ అయిన రాహుల్ గాంధీని పాదయాత్ర సందర్భంగా కలిసి సంతకం సేకరించేందుకు వెళ్లానని చెప్పారు. సోనియా గాంధీ కూడా చేనేత వస్త్రాలు ధరిస్తారని, తనకు ఆమె అంటే ఎంతో గౌరవం అని రాహుల్ తో చెప్పానని అన్నారు. అయితే, సోనియాగాంధీని కూడా కలవాలని తనకు రాహుల్ సూచించారని పూనమ్ వెల్లడించారు.