భారత్ లో కరోనా మహమ్మారి పెను విధ్వంసం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా గడచిన 24 గంటల్లో 4లక్షలకు పైచిలుకు కేసులు నమోదవడంతో దేశప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ వైపు ఆక్సిజన్ కొరత…మరోవైపు ఆసుపత్రుల్లో బెడ్ల కొరతతో కోవిడ్-19 రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. భారత్ లో భయానక పరిస్థితులపై వివిధ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే దేశంలోని కోవిడ్ రోగులకు సాయపడేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మెడికల్ అడ్వైజరీ హెల్ప్ లైన్ ని లాంచ్ చేశారు. ‘హలో డాక్టర్’ పేరుతో గల ఈ మెడికల్ అడ్వైజరీ హెల్ప్ లైన్ నెంబర్ ’91 998386838′ ను రాహుల్ గాంధీ తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. కోవిడ్ పై పోరులో డాక్టర్లు, మానసిక వైద్య నిపుణులు, ఇతర వైద్య సిబ్బంది సహకరించాలని, అవసరమైనవారికి వైద్య సలహాలు అందించాలని పిలుపునిచ్చారు.
అవకాశం ఉన్న డాక్టర్లు, మానసిక వైద్య నిపుణలు ఈ హెల్ప్ లైన్ లో తమ పేర్లను నమోదు చేసుకొని కోవిడ్ రోగులకు తమ అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని రాహుల్ కోరారు. ప్రస్తుతం భారత్ విపత్కర పరిస్థితులును ఎదుర్కుంటోందని, ఈ క్లిష్ట సమయంలో ఒకరికి ఒకరు సాయం చేసుకొని కోవిడ్ పై పోరాడాలని రాహుల్ పిలుపునిచ్చారు.
తమ హెల్ప్ లైన్ డాక్టర్లకు, రోగులకు అనుసంధాన కర్తగా పని చేస్తుందన్నారు. గత 24 గంటల్లో 4 లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయని, 3వేల మంది మరణించారని అన్నారు. ఈ తరుణంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నుంచి రోగులు చికిత్సను, సలహాలను, వారి ఆప్యాయతను కూడా కోరుతున్నారని రాహుల్ అన్నారు. రోగులను సంప్రదించేందుకు ఈ ‘హలొ డాక్టర్’ హెల్ప్ లైన్ లో వారు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలన్నారు.
కాగా, రాజకీయాలకు అతీతంగా కోవిడ్ రోగులకు, వారి బంధువులకు సాయపడి ఆదుకోవాలని రాహుల్ తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు గతంలోనే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన రాహుల్ ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా రోగుల కోసం రాహుల్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.