ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో ఈ రోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. తన సోదరుడి మరణవార్త విన్న వెంటనే ఢిల్లీ, మహారాష్ట్ర పర్యటనను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంతరంగా ముగించుకొని హైదరాబాద్ వచ్చారు. తన సోదరుడి పార్థివ దేహాన్ని చూసి చంద్రబాబు కన్నీరుమున్నీరయ్యారు. తన తమ్ముడి పార్థివదేహానికి నివాళి అర్పించిన చంద్రబాబు తన సోదరుడి మృతిపట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రామ్మూర్తి తనయులు నారా రోహిత్, గిరీశ్ లను అక్కున చేర్చుకుని చంద్రబాబు ఓదార్చారు.
తమ్ముడు రామ్మూర్తి నాయుడు తనను విడిచి వెళ్లిపోయాడని, తమ కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడని అన్నారు. ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవ చేశాడని, తమ్ముడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసి పరామర్శించారు.
రామ్మూర్తినాయుడు భౌతికకాయానికి చంద్రబాబుతో పాటు నందమూరి బాలకృష్ణ, సుజనా చౌదరి, సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కూడా నివాళులు అర్పించారు. కాగా, రామ్మూర్తినాయుడు భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామం నారావారి పల్లెకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నారావారిపల్లెలో రేపు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.