ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఉన్నపళంగా విడగొట్టిన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు కాంగ్రెస్ లో చక్రం తిప్పి సీఎం పదవిని కూడా చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి వంటి నేతలు కూడా ఉనికి కోల్పోయిన పరిస్థితి వచ్చింది. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్ లు దక్కలేదు. ఈ నేపథ్యంలనే 2024 ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ…ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే ఏపీకి చెందిన ముఖ్య నాయకులతో రాహుల్ గాంధీ ఢిల్లీలో చర్చలు జరుపుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రులు చింతా మోహన్, జేడీ శీలం, పళ్లం రాజు తదితరులంతా రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఏపీలో వైసీపీ పాలన, రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ ప్రణాళిక తదితర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ భేటీ నేపథ్యంలో ఏపీ, టీఎస్ కాంగ్రెస్ నేతలు జగన్ బెయిల్ రద్దుపై చర్చించుకుంటున్నారు. మరి కొద్ది రోజుల్లో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని చింతా మోహన్ కొద్ది రోజలు క్రితం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నెల 25న జగన్ బెయిల్ రద్దు విషయంలో తుది తీర్పు వచ్చే అవకాశముందన్న నేపథ్యంలో రాహుల్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. జగన్ జైలుకు వెళ్లే చాన్స్ ఉందని, ఒకవేళ అదే జరిగితే ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో అధికారం దక్కేలా చేయాలని రాహుల్ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.
జాతీయ స్థాయిలో జగన్ బెయిల్ రద్దుపై చర్చ జరుగుతోందని, జగన్ బెయిల్ రద్దు ఖాయమన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలోనే రాహుల్…హుటాహుటిన ఈ భేటీ ఏర్పాటు చేశారని తెలుస్తోంది. మరోవైపు, ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ స్థానంలో కొత్తవారిని నియమించే విషయంపై చర్చించేందుకు రాహుల్ ఈ మీటింగ్ పెట్టారని కాంగ్రెస్ లోని ఓ వర్గం చెబుతోంది. ఏది ఏమైనా, జగన్ జైలుకు వెళితే ఏపీలో మరోసారి పాగా వేయాలని రాహుల్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని చెప్పవచ్చు.