తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ నేత అనంత బాబు కొంతకాలంగా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అనంతబాబును కాపాడేందుకు అధికార పార్టీ అన్ని అస్త్రాలను ఉపయోగించిందని, కానీ, పార్టీకి డ్యామేజీ ఎక్కువ జరిగేలా ఉండడంతో తప్పక ఆయనను అరెస్టు చేయించిందని అప్పట్లో టాక్ వచ్చింది. ఇక, అనంతబాబుకు బెయిల్ వచ్చేందుకు వీలుగా ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించారని గతంలో విమర్శలు వచ్చాయి.
అయితే, టీడీపీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా తీవ్ర విమర్శలు గుప్పించడంతో అనంత బాబు విషయంలో వైసీపీ సర్కార్ సైలెంట్ కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు అనంతబాబుకు డీఫాల్ట్ బెయిల్ ను సుప్రీం కోర్టు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అనంతబాబుకు బెయిల్ వస్తే తన పలుకుబడిని ఉపయోగించి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకే ఆయనకు బెయిల్ ఇవ్వవద్దని సుబ్రహ్మణ్యం తల్లి వేసిన పిటిషన్ ను విచారణ జరిపేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి నెలకు వాయిదా వేసింది.
అయితే, అనంతబాబు కేసులో ఛార్జ్ షీటును ప్రభుత్వం పదేపదే ఉపసంహరించుకోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే అనంతబాబుకు బెయిల్ మంజూరు కావడంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు స్పందించారు. అనంతబాబు తమ పార్టీ వాడు కాబట్టే కాపాడుకున్నామని రఘురామ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోవడంతోనే బెయిల్ వచ్చిందని, వైసీపీ నేతలు హత్యలు చేసినా, ఇంకేం చేసినా తమ ప్రభుత్వ పెద్దలు కాపాడతారని చురకలంటించారు.
ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిందని, కార్పొరేషన్లను కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రధాని మోదీ కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని రఘురామ అన్నారు.