సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు గురువారం నాడు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కర్నూలు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్లు పేలిపోవడం కలకలం రేపింది. అయితే, ఆ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. అయితే, కొత్త కారు రెండు టైర్లు ఒకేసారి పేలిపోవడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఘటనపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉందని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు.
విజయమ్మ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారని తెలిసిందని, ఆ తర్వాత ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశానని, కానీ, ఆమెతో మాట్లాడలేకపోయానని రఘురామ చెప్పారు. విజయమ్మ ప్రయాణించిన కారు కేవలం మూడున్నర వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందని, ఆ కారు ట్యూబ్ లెస్ టైర్స్ రెండూ ఒకేసారి పేలిపోవడం అసంభవమని అన్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో తాను కొన్ని కార్ల కంపెనీల నిపుణులతో మాట్లాడానని, వారు కూడా ఇది నమ్మశక్యంగా లేదని వెల్లడించారని అన్నారు.
దీని వెనుక కచ్చితంగా ఏదో కుట్ర ఉందని, తమ ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ దుష్టచతుష్టయం అంటుంటారని, అందుకే ఈ కారు ప్రమాదంపై విచారణ జరిపించాలని కోరారు.ఇప్పటికే ముఖ్యమంత్రి బాబాయ్ ని కోల్పోయారని, ఇప్పుడు ఇలా జరగడం బాధాకరంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు, ఈరోజు సతీసమేతంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రఘురామ కలిశారు. ఏపీ ప్రభుత్వం తనను తీసుకెళ్లి కొట్టిన విషయాన్ని రాష్ట్రపతికి వివరించానని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల గురించి కూడా వివరించానని అన్నారు. భారతదేశ చరిత్రలో విద్యుత్ ట్రూ అప్ చార్జీలు పెట్టిన సీఎం జగన్ మాత్రమేనని దుయ్యబట్టారు.
ఏపీలో ఆస్తుల విలువ సగానికి సగం పడిపోయిందని, హైదరాబాద్ ఆస్తుల విలువ 10 రేట్లు పెరిగిందని అన్నారు..మహిళా కమిషన్ కూడా ఎంపీ గోరంట్ల మాధవ్ అంశంపై స్పందించిందని, ఎంపీ జస్బిర్ సింగ్ గిల్ ప్రధానమంత్రికి లేఖ రాశారన్నారు. ప్రైవేట్ ల్యాబ్స్ కు గోరంట్ల వీడియోను ఇవ్వొచ్చని సూచించారు. సూపర్ మ్యాన్, బాడ్ మ్యాన్ సినిమాలు ఉన్నాయి…ఇప్పుడు న్యూడ్ మ్యాన్ సినిమాలు అంటున్నారని రఘురామ ఎద్దేవా చేశారు.