ఏపీలో వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ వ్యాఖ్యలు చేసిన పవన్ పై కోర్టు విచారణకు అనుమతి జీవోను జగన్ ప్రభుత్వం జారీ చేయడంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. పవన్ పై కేసు పెట్టడానికి ప్రభుత్వం అనుమతినివ్వడం ఒక హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని మాత్రమే పవన్ అన్నారని రఘురామ చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను అంటే వాలంటీర్లను, ప్రభుత్వాన్ని అన్నట్టు కాదని తెలిపారు.
వాలంటీర్ల ద్వారా సేకరించిన డేటా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడాన్ని పవన్ ప్రశ్నించారని గుర్తు చేశారు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, ఈ కేసు చెల్లదని చెప్పుకొచ్చారు. ఇదో తొక్కలో కేసు అంటూ ఎద్దేవా చేశారు. ఈ కేసు ద్వారా పవన్ ఏమీ చేయలేరని, ఈనాడు మార్గదర్శి సంస్థలను ఏమీ చేయలేక వారి ఉద్యోగులను కిడ్నాప్ చేస్తున్నారని రఘురామ సంచలన విమర్శలు గుప్పించారు.
మరోవైపు 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం పవన్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జీవో ఇవ్వడంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. పవన్ ను అరెస్టు చేయాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను పవన్ చదువుతున్నారని, పబ్లిసిటీ కోసం పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ వ్యాఖ్యలు వాలంటీర్లను ఎంతో బాధించాయని అన్నారు. ప్రజా సేవ చేస్తున్న వాలంటీర్లపై తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం ఖండిస్తుందని స్పష్టం చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగదని, పదవులు వాటంతట అవే వస్తాయని అన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో విశాఖకు జగన్ రాబోతున్నారని సుబ్బారెడ్డి చెప్పారు.