వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచి, ఏడాది తిరక్కుండానే ఆ పార్టీకి వ్యతిరేకంగా మారారు రఘురామ కృష్ణంరాజు. రోజు రోజుకూ సొంత పార్టీ మీద ఆయన విమర్శలు, ఆరోపణలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఐతే ఆయనకు అడ్డుకట్ట వేసేందుకు వైకాపా ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న కారణంతో రఘురామ ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయించాలని ఆ పార్టీ తరఫున కొంత ప్రయత్నం జరిగిందవి కానీ.. ఫలితం లేకపోయింది. కాగా ఇప్పుడు పార్లమెంటరీ సబార్డినేట్ లెజిస్టేషన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి రఘురామకృష్ణంరాజును తప్పించేలా చేయడంలో వైకాపా విజయవంతమైనట్లు వార్తలొచ్చాయి. ఆయన ఆ పదవి నుంచి దిగిపోయిన మాట వాస్తవం. దీంతో వైకాపా పైచేయి సాధించినట్లుగా ఆ పార్టీ మద్దతుదారులు ఘనంగా ప్రకటనలు చేశారు.
ఐతే రఘురామకృష్ణంరాజు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టి పారేశారు. తనపై ఎవరూ వేటు వేయలేదు. తనను ఎవరూ తప్పించలేదు అని స్పష్టం చేశారు. తన ఏడాది పదవీ కాలం ముగిసిందని.. ఆ స్థానంలో వైకాపా మరో ఎంపీని కూర్చోబెట్టిందని ఆయనన్నారు. ఇక పదవి నుంచి తప్పించడం అనే విషయానికి వస్తే.. ఎవరు తప్పుకోబోతున్నారో, ఎవరిపై వేటు పడబోతోందో వైకాపా మద్దతుదారులకు రెండు మూడు నెలల్లో తెలుస్తుందని ఒక నర్మగర్భమైన వ్యాఖ్య చేశారు రఘురామ.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులపై రోజు వారీ విచారణ ప్రారంభమైన నేపథ్యంలో ఆయన బెయిల్ రద్దు కావచ్చన్న ఊహాగానాలు వస్తుండటం, మరోవైపు జస్టిస్ ఎన్వీ రమణపై చేసిన తీవ్ర ఆరోపణలను రుజువు చేయని పక్షంలో ఆయన కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లయి పదవీ గండం వస్తుందన్న అంచనాల నేపథ్యంలో రఘురామ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
కాగా తనపై అనర్హత వేటు వేయించడానికి జరుగుతున్న ప్రయత్నాలపై రఘురామ స్పందిస్తూ.. ముఖ్యమంత్రికి సవాలు విసురుతున్నానని, దమ్ముంటే తనపై వేటు వేయించాలని అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించడంపై రెఫరెండం పెడితే తాను జగన్మోహన్ రెడ్డి మీద అయినా 2 లక్షల మెజారిటీతో గెలుస్తానని ఆయన మరో ఛాలెంజ్ చేయడం విశేషం.