నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ పక్కా మాస్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తోంది. ఇక, ఈ చిత్రంలో జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పరోక్షంగా బాలయ్య బాబు చెప్పిన డైలాగులకు థియేటర్లో నందమూరి అభిమానులు విజిల్స్ తో మోత మోగిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆ డైలాగులపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఆ సినిమాలో బాలకృష్ణ డైలాగులు చూసి తమ పార్టీ నేతలు భుజాలు తడుముకుంటున్నారని రఘురామ ఎద్దేవా చేశారు. చంద్రబాబును గతంలో విమర్శించిన పవన్ ఇప్పుడు ఆయనతో పొత్తు ఎలా పెట్టుకుంటారని వైసిపి నేతలు ప్రశ్నిస్తుండటంపై కూడా రఘురామ స్పందించారు. ప్రస్తుతం జగన్ క్యాబినెట్లో ఉన్న మంత్రులు గతంలో జగన్ ను విమర్శించిన వారేనని అన్నారు.
వల్లభనేని వంశీ, జూపూడి ప్రభాకర్ వంటి వారు ఆయనను విమర్శించి వైసీపీలో చేరారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన కలవాల్సిన అవసరం ఉందని, ఆ రెండు పార్టీలకు మరో పార్టీ తోడు కావాలని రఘురామ ఆకాంక్షించారు. టిడిపి పసుపు, జనసేన ఎరుపు కలిస్తే కాషాయం వస్తుందని, ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని కోరుకునే వారిలో తాను కూడా ఒకడినని అన్నారు.
ఒక పార్టీకి బలం లేనప్పుడు పరస్పర గౌరవాన్ని కాపాడుకుంటూ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న పవన్ సూచన తనకు నచ్చిందని చెప్పారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని రణస్థలం సభలో పవన్ చెప్పకనే చెప్పేశారని రఘురామ అన్నారు. ఈ పొత్తును వైసీపీ నేతలు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు.