జగన్ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో పలు పరిణామాలు వివాదాస్పదమవ్వడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. తిరుమలలో ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం మొదలుకొని…టీటీడీ భూముల వేలంపాట, సప్తగిరి మాసపత్రికలో లవకుశ కథ వరకు పలు వివాదాలు టీటీడీని, వైసీపీ సర్కార్ ను చుట్టుముట్టాయి.
ఇక, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ సినీ నటుడు పృథ్వీ ఆడియోటేపు వ్యవహారం పెను దుమారం రేపడం, ఆయన తన పదవికి రాజీనామా చేయడం సంచలనం రేపింది. మరోవైపు, టీటీడీకి చెందిన 50 ఆస్తుల వేలం వ్యవహారం వివాదాస్పదం కావడంతో….టీటీడీ ఆస్తుల వేలంపై టీటీడీ ఏకంగా నిషేధం విధించాల్సి వచ్చింది. దీంతోపాటు, లడ్డూ ప్రసాద విక్రయం వివాదం, టికెట్ కౌంటర్ల వ్యవహారం కూడా చర్చనీయాంశమైంది.
ఈ పరిణామాల నేపథ్యంలో హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం నడుచుకుంటోందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణపై వైసీపీ రెబల్ ఎంపీ రఘరామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటి నిర్వహణ చేతకాకుంటే వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జవహర్‌రెడ్డి టీటీడీ పదవుల నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సామాన్య ప్రజలు మొదలుకొని పలువురు ప్రముఖుల వరకు ఎందరో ఇచ్చిన వందల కోట్ల విరాళాలతో టీటీడీలో నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారని, ఆగమ మండలి ఏర్పాటుపై కొంచెం దృష్టి పెట్టాలని అన్నారు. టీటీడీ కల్యాణ మండపాలు అద్దెకిచ్చారని, వాటిలో సువార్త సభలు పెడితే సుబ్బారెడ్డి ఎందుకు ఆపలేదని రఘురామ ప్రశ్నించారు. వెంకన్నపై భక్తితో భక్తులు ఇచ్చిన భూముల్లో కల్యాణ మండపాలు నిర్మించి, వాటిని ఎవరికో అద్దెకివ్వడం ఏమిటని నిలదీశారు. ధర్మ పరిషత్ ఏర్పాటులో జాప్యం ఎందుకు జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.
జెరూసలేం వెళ్లే యాత్రికులకు సబ్సిడీ ఇస్తున్నారని, కానీ, టీటీడీలో అన్నింటికీ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆర్ఆర్ఆర్ ఫైర్ అయ్యారు. జెరూసలేంకి ఇచ్చే సబ్సిడీకి తిరుమలలో దోపిడీ ఏమిటని సూటిగా ప్రశ్నించారు. టీటీడీ ఆదాయం కోసం రూమ్‌రెంట్లు పెంచడం సరికాదన్నారు. భక్తులను భగవంతుడికి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని చెప్పారు.
మద్యంపై జగన్ వేలకోట్లు అప్పులు చేశారని. ఆ రుణమే భవిష్యత్తులో రణమవుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఇంకో 25 వేల కోట్ల రూపాయల రుణాలకు ప్రణాళికలు వేస్తున్నట్లుగా తెలుస్తోందని, ఇంకా ఏపీని అప్పులు ఊబిలోకి నెడుతున్నారని విమర్శించారు. ఏపీలో ఇసుక చోరీలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసిన 9మందికి అభినందనలు తెలిపారు.