ఏపీలో విద్యుత్ కోతలపై ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ట్రూ ఆప్ చార్జీల పేరుతో కరెంటు బిల్లులు పట్టుకుంటేనే సామాన్యులకు షాక్ కొడుతోందంటూ విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు, తాజాగా ఏపీలో మొదలైన అనధికారిక విద్యుత్ కోతలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విరుచుకుపడ్డారు.
ప్రజలకు పవర్ (విద్యుత్) మనం కట్ చేస్తే, వచ్చే ఎన్నికల్లో ప్రజలు మన పవర్ (అధికారం) కట్ చేస్తారంటూ ఆర్ఆర్ఆర్ సెటైర్ వేశారు. పెంచిన కరెంటు చార్జీలతో జగనన్న విద్యుత్ వాతలతో బాధపడుతున్న జనం.. తాజాగా జగనన్న విద్యుత్ కోతలతో అష్టకష్టాలు పడుతున్నారని రఘురామ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పరిపాలనా రాహిత్యం, అవగాహనాలోపం వల్లే ఏపీలో విద్యుత్ రంగం చతికిలపడిందని దుయ్యబట్టారు.
పీక్ అవర్స్ లో కరెంటు వినియోగం తగ్గించాలంటూ ప్రభుత్వం హుకుం జారీ చేయడంపై రఘురామ అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయంత్రం 6 నుంచి 10 వరకు ఒక్క ఫ్యాన్ మాత్రమే వినియోగించుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి హితవచనాలు పలికారని ఎద్దేవా చేశారు. మొత్తం ఆపేస్తే అసలుకే మోసం వస్తుందని సజ్జల భయపడ్డారని, అందుకే ఫంకా (ఫ్యాన్-వైసీపీ గుర్తు)కు సడలింపు ఇచ్చారని చురకలంటించారు.
త్వరలోనే రాష్ట్రంలో చీకటి రోజులు వస్తాయేమోనని రఘురామ జోస్యం చెప్పారు. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడంవల్లే ఏపీలో విద్యుత్ సంక్షోభం వచ్చిందని మండిపడ్డారు. బొగ్గుకు ఎలాంటి లోటు లేదని కేంద్ర మంత్రి ప్రకటిస్తే, అది అబద్ధమని సజ్జల చెప్ప డం ఎంత వరకు సమంజసమని రఘురామ ప్రశ్నించారు.